US embassy | రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Russia – Ukraine War) మరింత ముదురుతున్నది. రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతివ్వడం ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని (US embassy) మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
కీవ్ (Kyiv)లోని అమెరికా రాయబార కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అమెరికాకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎంబసీని మూసివేయాలని నిర్ణయించారు. నవంబర్ 20న దాడి జరిగే అవకాశం ఉందని తమకు కచ్చితమైన సమాచారం వచ్చిందని అమెరికా తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో పనిచేసే ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అదేవిధంగా ఎయిర్ అలర్ట్‌లు ప్రకటించగానే కీవ్‌లోని అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని సూచించింది.
రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. చాలా కాలంగా కోరుతున్న అనుమతి లభించడంతో ఉక్రెయిన్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. అమెరికా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్ ఏకంగా ఆరు దీర్ఘశ్రేణి క్షిపణుల్ని రష్యాపై ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మరింత ముదిరింది.
రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి అనుమతిస్తే తమ అణు విధానాన్ని మార్చుకుంటామని, తమపై దాడిని ఉమ్మడి దాడిగా భావిస్తామని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు అమెరికా అనుమతివ్వడాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది. ఉక్రెయిన్‌పై అణుదాడి చేసేందుకు వీలుగా తన అణు విధానాన్ని మార్చుకుంది. ఈ మేరకు తయారుచేసిన కీలక ఉత్తర్వుపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం సంతకం చేశారు. ఏదైనా దేశం వద్ద అణ్వాయుధాలు లేకపోయినప్పటికీ అణ్వాయుధాలు కలిగిన దేశాల మద్దతుతో తమ దేశంపై దాడి చేస్తే, తమ దేశం అణ్వాయుధాలతో దాడి చేసేందుకు ఈ ఉత్తర్వు అనుమతి ఇస్తున్నది. దీంతో ఉక్రెయిన్‌పై అణుదాడికి వెనుకాడబోమని రష్యా పరోక్షంగా హెచ్చరించినట్టు అయ్యింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు రెండు దేశాల మధ్య నడిచిన యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించడం, దీనిని స్పందన తమ అణువిధానాన్ని రష్యా మార్చుకోవడంతో ఐరోపాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అమెరికా సహా నాటో దేశాలు సైతం అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నదనే భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధమే సంభవిస్తే ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలను స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు ప్రజలకు వివరిస్తున్నాయి.
Also Read..
Russia-Ukraine war | ప్రపంచ యుద్ధం దిశగా? రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ దాడి