మాస్కో, నవంబర్ 19: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతున్నది. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య నడిచిన యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. అమెరికా సహా నాటో దేశాలు సైతం అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నదనే భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతివ్వడం ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచేసింది.
చాలా కాలంగా కోరుతున్న అనుమతి లభించడంతో ఉక్రెయిన్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. అమెరికాలానే తాము సరఫరా చేసిన స్టార్మ్ షాడో క్షిపణుల వినియోగానికి యూకే, స్కాల్ప్ క్షిపణుల వినియోగానికి ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్‌కు అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ‘దాడులు మాటల్లో జరగవు. క్షిపణులే మాట్లాడతాయి. 2025లో యుద్ధ విజేత ఎవరో ప్రపంచం చూస్తుంది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే మంగళవారం తమ దేశంలోని బ్రయాన్స్ ప్రాంతంపై ఆరు ఏటీఏసీఎం క్షిపణులతో ఉక్రెయిన్ దాడి చేసిందని, వాటిని కూల్చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి అనుమతిస్తే తమ అణు విధానాన్ని మార్చుకుంటామని, తమపై దాడిని ఉమ్మడి దాడిగా భావిస్తామని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు అమెరికా అనుమతివ్వడాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది. ఉక్రెయిన్‌పై అణుదాడి చేసేందుకు వీలుగా తన అణు విధానాన్ని మార్చుకుంది. ఈ మేరకు తయారుచేసిన కీలక ఉత్తర్వుపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం సంతకం చేశారు. ఏదైనా దేశం వద్ద అణ్వాయుధాలు లేకపోయినప్పటికీ అణ్వాయుధాలు కలిగిన దేశాల మద్దతుతో తమ దేశంపై దాడి చేస్తే, తమ దేశం అణ్వాయుధాలతో దాడి చేసేందుకు ఈ ఉత్తర్వు అనుమతి ఇస్తున్నది. దీంతో ఉక్రెయిన్‌పై అణుదాడికి వెనుకాడబోమని రష్యా పరోక్షంగా హెచ్చరించినట్టు అయ్యింది.
ఏదైనా అణ్వాయుధ దేశం మద్దతుతో తమ దేశంపై దాడి జరిగితే, దానిని ఉమ్మడి దాడిగా భావిస్తామని సైతం రష్యా తన అణువిధానంలో చేర్చింది. తద్వారా ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న నాటో దేశాలకు సైతం రష్యా హెచ్చరిక జారీ చేసినట్టు అయ్యింది. దీంతో యుద్ధంలోకి నాటో దేశాలు కూడా చేరే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ముంచుకొస్తున్నట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘శాంతిస్థాపనకు, ప్రాణాలు కాపాడేందుకు మా నాన్నకు అవకాశం రావడానికి ముందే మూడో ప్రపంచ యుద్ధం కావాలని ఆయుధ పరిశ్రమ కోరుకుంటున్నట్టు ఉంది’ అని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతున్నది. బైడెన్ నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా కూడా పేర్కొన్నది.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మంగళవారానికి వెయ్యి రోజులకు చేరుకున్నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో నెలకొన్న అతిపెద్ద సంక్షోభం ఇది. ఈ యుద్ధంలో తమ 80 వేల మంది సైనికులు మరణించారని, నాలుగు లక్షల మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంచనా వేస్తున్నది. ఉక్రెయిన్‌లో ఆగస్టు 31 నాటికే 11,743 మంది సాధారణ ప్రజలు మరణించారని, 24,614 మంది గాయపడ్డారని ఐరాస పేర్కొన్నది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో కోటి మంది జనాభా తగ్గిందని తేల్చింది. ఉక్రెయిన్ పునరుద్ధరణకు రూ.41 లక్షల కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఉక్రెయిన్ భూభాగంలో ఐదో వంతును రష్యా ఆక్రమించింది. యుద్ధాన్ని రష్యానే ప్రారంభించినప్పటికీ ఆ దేశం కూడా భారీగానే నష్టాన్ని చవిచూసిందని పాశ్చాత్య దేశాల నిఘా వర్గాలు చెప్తున్నాయి. రష్యా సైనికులు రెండు లక్షల మంది మరణించారని, నాలుగు లక్షల మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్టు దౌత్యవర్గాలు మంగళవారం తెలిపాయి. జూలైలో మాస్కోలో జరిగిన చర్చల సమయంలో భారత్‌లో పర్యటించాల్సిందిగా పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. మంగళవారం భారతీయ ఎడిటర్లతో వీడియో సమావేశంలో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, త్వరలో పుతిన్ భారత్‌లో పర్యటించవచ్చని చెప్పారు. అయితే, నిర్దిష్ట తేదీలను మాత్రం ప్రకటించలేదు.