Indian Student | అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి (Indian Student) నీలమ్ షిండే (Nilam Shinde) తల్లిదండ్రులకు వీసా (Visa) మంజూరైంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన బిడ్డను చూడటానికి అత్యవసర వీసా మంజూరు చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన అమెరికా.. వారికి ఇంటర్వ్యూ చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌కు ఇంటర్వ్యూకు రావాలని కోరింది. అధికారుల సూచనల మేరకు నీలమ్ తల్లిదండ్రులు ఇవాళ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి అత్యవసర వీసాను యూఎస్ రాయబార కార్యాలయం (US Embassy) అధికారులు మంజూరు చేశారు.
అమెరికాలోని ఒక యూనివర్సిటీలో చదువుతున్న మహారాష్ట్ర సితార జిల్లాకు చెందిన నీలమ్ షిండే (35) ఈనెల 14న కాలిఫోర్నియాలో ఫోర్ వీలర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం విద్యార్థిని కోమాలో ఉంది. ఆమెకు బ్రెయిన్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో కుమార్తెను చూసేందుకు వీసా కోసం తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వారికి వీసా మంజూరు కాలేదు. దీంతో లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే జోక్యం చేసుకొని.. నీలమ్ షిండే చావుబతుకుల్లో ఉందని ఆమెను చూసేందుకు తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. ఆమె విజ్ఞప్తితో జోక్యం చేసుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. బాధిత కుటుంబానికి యూఎస్ వీసా అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ స్లాట్‌ను వేగవంతం చేసింది.
ఇక వీసా మంజూరు కావడంతో బాధిత కుటుంబం అందుబాటులో ఉన్న ఫ్లైట్‌లో యూఎస్ బయల్దేరనున్నారు. ‘వీసా ఇంటర్వ్యూ ప్రక్రియ చాలా సాఫీగా జరిగింది. వీసా ప్రింటెడ్ కాపీ కూడా మాకు అందింది. తదుపరి విమానంలో మేము యూఎస్ బయల్దేరుతున్నాము. మాకు వీసా మంజూరు అయ్యేలా సాయం చేసిన మీడియాకు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎంపీ సుప్రియా సూలేకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము’ అని నీలమ్ బంధువులు తెలిపారు. ఇక అమెరికా వెళ్లేందుకు రూ.5 నుంచి రూ.6 లక్షల వరకూ అప్పు తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేస్తే బాగుంటుందని కోరారు.
Also Read..
Oxygen | భూమిపై ప్రాణవాయువు ఏర్పాటులో కీలకపాత్ర అగ్నిపర్వతాలదే!
Earthquake | నేపాల్‌లో భూకంపం.. ఉత్తర భారతంలో ప్రకంపణలు
Porsche Car | భార్య తిరస్కరించిందని.. లగ్జరీ కారును చెత్తకుప్పలో వదిలేశాడు