Oxygen | న్యూయార్క్: కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై పీల్చేందుకు ప్రాణవాయువు లభించేది కాదు. దీంతో జీవం మనుగడే ఉండేది కాదు. ఆ తర్వాత భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే, ఆక్సిజన్ ఉత్పత్తి ఎలా మొదలయ్యిందనే అంశం మాత్రం ఇంతకాలంగా అంతుచిక్కలేదు. ఈ ప్రశ్నకు ఒక అధ్యయనం సమాధానం కనుగొన్నది.
ఆక్సిజన్ ఉత్పత్తికి అగ్నిపర్వతాలు దోహదపడ్డాయని తేల్చింది. కోట్ల ఏండ్ల క్రితం క్యానోబ్యాక్టీరియాతో ఏర్పడిన స్ట్రోమాటోలైట్స్ అనే రాతి నిర్మాణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అప్పట్లో సముద్రాల్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండేదని, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే నైట్రోజెన్ సహా ఇతర ఖనిజాలు, పోషకాలు సముద్రంలోకి చేరాయని, ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని కల్పించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా ఆక్సిజన్ ఉత్పత్తికి దోహదపడ్డ ఫోటోసింథేసిస్ ఏర్పడిందని తేల్చారు.