Pause Tariffs | అగ్రరాజ్యం అమెరికా, చైనా (US-China) మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. ఇరుదేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి 10 శాతానికి తగ్గించింది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145 నుంచి 30 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు 90 రోజులు మాత్రమే అమల్లో ఉండేలా ఇరు దేశాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అమెరికా, చైనా (China) మధ్య గత కొన్ని రోజులుగా వాణిజ్య యుద్ధం (Tariff War) కొనసాగుతున్న విషయం తెలిసిందే. డ్రాగన్‌పై అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సుంకాల మోత మోగించారు. రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అన్ని దేశాలపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే, చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 145 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు.
గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. దీనిపై డ్రాగన్ దీటుగా స్పందించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది (China tariffs). దీనిపై ఆగ్రహించిన ట్రంప్ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ డ్రాగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టారిఫ్‌లు 104 శాతానికి చేరాయి.
అయినా చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాపై 84 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో మళ్లీ అదనపు సుంకాల పోటు తప్పలేదు. చైనా నిర్ణయంతో ట్రంప్ మరో 21 శాతం బాదారు. దీంతో చైనాపై ప్రతీకార సుంకాలు 125 శాతానికి చేరింది. టక ఫెంటానిల్ అక్రమ రవాణాలో చైనా పాత్ర ఉందన్న ఆరోపణలకుగాను ప్రత్యేకంగా 20 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్‌లు 145 శాతానికి చేరింది. ఇక చైనా సైతం అమెరికాపై 125 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా రెండు దేశాలు సుంకాలు తగ్గించేందుకు అంగీకారం కుదుర్చుకున్నాయి.
Also Read..
ISRO | దేశ భద్రత కోసం 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయి : ఇస్రో చైర్మన్
Donald Trump | భారత్-పాక్‌తో కలిసి కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు