Russia-Ukraine War | రష్యాతో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆశిస్తున్నారు. రష్యాతో పూర్తిస్థాయి కాల్పుల విరమణను ఆశిస్తున్నట్లు తెలిపారు. టర్కీలో చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం వ్యక్తిగతంగా నిరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి రష్యన్లు సాకులు వెతకరని ఆశిస్తున్నానన్నారు. ఇంతకు ముందు యూరోపియన్ మిత్రదేశాలతో కలిసి ఉక్రెయిన్ చర్చలకు ముందు సోమవారం నుంచి 30 రోజుల కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని డిమాండ్ చేసింది. అయితే, మాస్కో ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. బదులుగా చర్చలకు పిలుపునిచ్చింది. మే 15న టర్కీలో ప్రత్యక్ష చర్చలు జరపాలనే రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. పుతిన్ శాంతి చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించాలని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వేదికగా పేర్కొన్నారు. అప్పుడే ఒప్పందం సాధ్యమేనా? కాదా? అనే విషయాన్ని నిర్ణయించగలరన్నారు.
అయితే, రష్యాతో పూర్తిస్థాయి, బేషరతు కాల్పుల విరమణకు తాము సిద్ధమేనని ఉక్రెయిన్, మిత్రపక్ష దేశాలు ప్రకటించారు. 30 రోజులు కాల్పుల విరమణను పాటించేలా ఈ ప్రతిపాదనను గత శనివారం రష్యాముందుంచాయి. నాలుగు ఐరోపా దేశాల నేతలు శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, బ్రిటన్ దేశాల అధినేతలు సమావేశమై చర్చలు జరిపారు. రష్యాతో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాల్సిన ఆవశ్యకతను జెలెన్స్కీకి వివరించారు. ఉక్రెయిన్‌తో పాటు ఐరోపా దేశాల శాంతి, సుస్థిరతలకు ఇది అవసరమని పేర్కొన్నారు. సంధికి అంగీకరించి, శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యేలా రష్యాపైనా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ మేరకు నాలుగు దేశాల నేతలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విరమణ చర్చలు జరిపేందుకు ఇచ్చిన ఆఫర్ సానుకూల సందేశమని.. ప్రపంచం మొత్తం దీని కోసం చాలాకాలంగా ఎదురు చూస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు.
అయితే, ఏ యుద్ధాన్ని అయినా ముగించేందుకు తొలి అడుగులు కాల్పుల విరమణ అన్నారు. బేషరతుగా 30 రోజుల కాల్పుల విరమణ సోమవారం ప్రారంభం కావాలని, ఇకపై ఒక్కరోజు కూడా రక్తపాతం కొనసాగించడం సరైనది కాదని ఆయన అన్నారు. మే 12 నుంచి రష్యా పూర్తి, శాశ్వత కాల్పుల ప్రకటిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆ తర్వాత పుతిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించారు. ఎలాంటి షరతులు లేకుండా టర్కీలో ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలకు ప్రతిపాదించారు. చర్చల సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించవచ్చన్నారు. నాలుగు ప్రధాన యూరోపియన్ దేశాల నాయకులు 30 రోజుల్లోపు కాల్పుల విరమణను అంగీకరించకపోతే, రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించిన సమయంలో పుతిన్ నుంచి స్పందన వచ్చింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లతో చర్చల తర్వాత జెలెన్స్కీ కాల్పుల విరమణను ప్రతిపాదించారు.
ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలకు పుతిన్ ప్రతిపాదించడం మొదటి అడుగు అని, కానీ అదొక్కటే సరిపోదని మాక్రాన్ అన్నారు. దీని కారణంగా పాశ్చాత్య దేశాలు మాస్కో ఉద్దేశంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా.. పుతిన్ ఆదివారం టర్కిష్ అధ్యక్షడు ఎర్డోగన్‌తో మాట్లాడారు. ఎర్డోగన్ రష్యా ప్రతిపాదనకు పూర్తిగా మద్దతు ప్రకటించారు. శాశ్వత శాంతిని సాధించే లక్ష్యంతో చర్చలను నిర్వహించడంలో తాను అన్ని విధాలుగా సహాయం చేస్తానన్నారు. ఇదిలా ఉండగా.. మూడు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత.. ఆదివారం తెల్లవారు జాము నుంచి ఉక్రెయిన్‌పై రష్యా భారీగా డ్రోన్ దాడులు జరిపింది. రష్యా ఆరు వేర్వేరు దిశల నుంచి 108 దాడి డ్రోన్లు, సిమ్యులేటర్ డ్రోన్లను ప్రయోగించిందని.. వాటిని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. 60 డ్రోన్లను కూల్చివేశామని, 41 ఇతర సిమ్యులేటర్ డ్రోన్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది.