Donald Trump | న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్, పాకిస్థాన్ దేశాలతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కాల్పుల విరమణకు సయోధ్య కుదిర్చామని శనివారం ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ ద్వారా ఆయనీ విషయాన్ని వెల్లడించారు.
‘వేయి సంవత్సరాల తర్వాత కశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందేమో చూసేందుకు మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను. గొప్ప పని చేసినందుకు భారత్, పాక్ నాయకత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే లక్షలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారని, ఇరు దేశాల నేతలు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. దేశానికి సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిద్ధమైన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, పాక్ రక్షణ మంత్రి ఖావాజా అసిఫ్ మాత్రం ఇలాంటి సమావేశమేదీ జరగలేదని తేల్చి చెప్పారు. భారత్, పాకిస్థాన్ దేశాలు బలమైన, అచంచల నాయకత్వ పటిమకు తాను గర్విస్తున్నానని, ఎంతోమంది మరణానికి, విధ్వంసానికి దారితీసే ప్రస్తుత దూకుడుకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం ఇదేనని ఇరు దేశాలు గ్రహించాయని అన్నారు. ‘మీ ధైర్యవంతమైన చర్యలతో మీ వారసత్వం ఎంతగానో పెరిగింది. చారిత్రక, వీరోచిత నిర్ణయానికి అమెరికా సాయం చేసినందుకు గర్వంగా ఉంది’ అని ట్రంప్ వివరించారు.
ట్రంప్ ఆఫర్‌ను స్వాగతించిన పాక్
కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను పాకిస్థాన్ స్వాగతించింది. దక్షిణాసియా, దాని ఆవల శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న దీర్ఘకాల సమస్య అయిన జమ్ముకశ్మీర్ వివాద పరిష్కారానికి ట్రంప్ తన సంసిద్ధతను వ్యక్తం చేయడాన్ని తాము అభినందిస్తున్నట్టు పేర్కొంది. జమ్ముకశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వత పరిష్కారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఉండాలని, కశ్మీరీ ప్రజల ప్రాథమిక హక్కులు, వారి స్వయం నిర్ణయాధికార హక్కును కూడా సాధించేలా చూడాలని పాక్ నొక్కి చెప్పింది.
ప్రపంచ శాంతికి ట్రంప్ మార్గదర్శక నాయకత్వం, నిబద్ధత, దక్షిణాసియాకు శాశ్వత శాంతిని తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించాలనే ట్రంప్ అత్యంత విలువైన ప్రతిపాదనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ‘దశాబ్దాలుగా పాక్, అమెరికా దేశాలు పరస్పర ప్రయోజనాలను రక్షించుకునేందుకు, ప్రపంచంలోని కీలక ప్రాంతాల్లో శాంతి, భద్రత కోసం భాగస్వాములుగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ధరించగల, పాకిస్థాన్-యూఎస్ సంబంధాలను బలోపేతం చేయగల గొప్ప భాగస్వామిని పాక్ కనుగొంది. వాణిజ్యం, పెట్టుబడిలో మాత్రమే కాకుండా సహకారానికి సంబంధించి అన్ని రంగాల్లో కూడా’ అని షెహబాజ్ ట్వీట్ చేశారు.