Nepal: భారత సరిహద్దు దేశమైన నేపాల్ లో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీంతో ఆ ఘర్షణ ప్రభావం ఇండియాపై పడకుండా భారత ప్రభుత్వం ఇరు దేశాల సరిహద్దును మూసివేసింది. భద్రతా కారణాల రీత్యా, ముందస్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేపాల్ లోని పార్సా జిల్లా, బిర్గంజ్ పట్టణంలో నిరసనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇటీవల నేపాల్ లోని ధనుషా జిల్లా, కమలా మున్సిపాలిటీకి చెందిన హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే ఇద్దరు ముస్లింలు సోషల్ మీడియాలో ఒక మతాన్ని కించపరుస్తూ, రెచ్చగొట్టేలా వీడియో విడుదల చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఆ మతానికి చెందిన వారు ఆందోళన చేపట్టారు. దీంతో ధనుషా, పార్సా జిల్లాలో ఆందోళనలు పెరిగాయి. స్థానికులు ఆ ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో కొందరు కమలా ప్రాంతాంలోని ఒక మసీదును ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో కొందరు పోలీసు స్టేషనుపై కూడా దాడి చేసి, రాళ్లు విసిరారు. ఈ దాడుల్ని అణిచివేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నేపాల్ లోని హిందువులు ఈ ఘర్షణల్లో అధికంగా పాల్గొంటున్నారు. తమ దేవతల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం పార్సా జిల్లాలోని బిర్గంజ్ ప్రాంతంలో ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
దీంతో అధికారులు అక్కడ కర్ఫ్యూ విధించారు. ఈ ప్రాంతం బిహార్ లోని రాక్సాల్ జిల్లాకు దగ్గరగా ఉంటుంది. అందువల్ల అక్కడి ప్రభావం మనపై పడకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నేపాల్-భారత్ సరిహద్దుల్ని పూర్తిగా మూసేసి, రాకపోకల్ని నిషేధించారు. అత్యవసర సేవల్ని కూడా నిలిపివేశారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఘర్షణల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయులు ఎక్కువగా తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు.