ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోవాలనుకున్న రష్యా బలగాలను అడ్డుకున్నామని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ‘‘రష్యా బలగాలను మన మిలటరీ అడ్డుకుంది’’ అని ఆయన చెప్పారు. కీవ్‌ను స్వాధీనం చేసుకొని, తన అడ్డు తొలగించుకోవాలనుకున్న రష్యా బలగాల ఆశ నెరవేరలేదన్నారు. అలాగే తమ దేశంపై చోరబాటును ఆపాల్సిందిగా వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి చేయాలని రష్యా ప్రజలను కోరారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన జెలెన్స్కీ.. రాజధాని కీవ్, దాని చుట్టుపక్కల ఉన్న ప్రధాన పట్టణాలను రష్యా బలగాల నుంచి కాపాడుకున్నట్లు వెల్లడించారు. తాజాగా ఉక్రెయిన్ మిలటరీ ప్రతిఘటిస్తున్నప్పటికీ రష్యా బలగాలు కీవ్‌కు 30 కిలోమీటర్ల దూరంలోకి వచ్చేశాయని యూకే రక్షణ శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే తాము కీవ్‌ను కాపాడుకున్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు.
అదే సమయంలో తమ దేశానికి మద్దతుగా రష్యాలో నిరసనలు చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే రష్యా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేయాలని కోరారు. ‘‘మీకు, మాకు, ప్రపంచానికి అబద్ధాలు చెప్పేవాళ్లను అడ్డుకోండి’’ అని అభ్యర్థించారు. తమ దేశంలోకి చొరబడినందుకు రష్యా ప్రభుత్వాన్ని శిక్షించాలని, ఆ దేశానికి స్విఫ్ట్ (SWIFT) వ్యవస్థతో ఉన్న సంబంధాలను కత్తిరించాలని హంగేరి, జర్మనీ దేశాలను జెలెన్స్కీ డిమాండ్ చేశారు.