UAE-INDIA : అంతర్జాతీయంగా ఇండియా ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. యూఏఈ ప్రెసిడెంట్ ఇండియా టూర్ ముగించుకుని వెళ్లిన వారం రోజుల్లోనే పాకిస్తాన్‌కు షాకిచ్చారు. పాకిస్తాన్‌తో చేసుకున్న ఎయిర్పోర్ట్ ఒప్పందాన్ని యూఏఈ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ డీల్ రద్దుకు భారత్‌తో యూఏఈ కుదుర్చుకున్న ఒప్పందమే కారణం అనే ప్రచారం జరుగుతోంది.
గత వారం యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఆయన మూడు గంటలు మాత్రమే ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కానీ, ఈ మూడు గంటల్లోనే ఇండియా-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయని రెండు దేశాలు ప్రకటించాయి. ఇదే సమయంలో గతంలో పాకిస్తాన్‌తో యూఏఈ కుదుర్చుకున్న ఎయిర్పోర్ట్ డీల్‌ను రద్దు చేసుకుంది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తామని పాకిస్తాన్‌తో యూఏఈ గత ఏడాది ఆగష్టులో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్.. సరైన నిర్వహణ భాగస్వామిని చూపించకపోవడం వల్లనే ఈ డీల్ రద్దైనట్లు అధికారికంగా వెల్లడించింది. కానీ, దీని వెనుక అంతర్జాతీయ రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఉన్న వివాదం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు.
పాకిస్తాన్.. సౌదీతోపాటు మరికొన్ని దేశాలను కలుపుకొని ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. సౌదీ అరేబియా ఉంది కాబట్టి.. ఇందులో ఆ దేశ ప్రత్యర్థి అయిన యూఏఈ ఉండబోదు. అందుకే దీనికి పోటీగా యూఏఈ.. ఇండియా, ఇజ్రాయెల్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. తాజాగా ఈ అంశంపై చర్చ జరిగినందునే పాకిస్తాన్‌కు యూఏఈ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇండియాకు మరింత దగ్గరయ్యేందుకు యూఏఈ.. పాక్‌తో డీల్ క్యాన్సిల్ చేసుకుంది. మరోవైపు యూఏఈ జైళ్లలో మగ్గుతున్న 900 మంది భారత ఖైదీలను విడుదల చేసేందుకు కూడా యూఏఈ అంగీకారం తెలిపింది.