Tesla Cars | అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla)పై దాడులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడులు చేస్తున్నారు. షోరూమ్‌పై కాల్పులు, నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం లాస్ వెగాస్ (Las Vegas)లో ఉన్న టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆ కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
వరుస దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ‘టెస్లాపై దాడులకు పాల్పడే వారు 20 సంవత్సరాల వరకూ జైలు శిక్షకు గరయ్యే అవకాశం ఉంది. దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదు’ అని హెచ్చరిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు.
కాగా, ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖ అధిపతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుతో టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు.
రెండు రోజుల క్రితం లాస్ వెగాస్ (Las Vegas)లో ఉన్న టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆ కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అంతేకాదు, ఓ కారుపై అభ్యంతరకర వ్యాఖ్యలతో స్ప్రే పెయింట్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మరోవైపు కాన్సాస్ సిటీ (Kansas City)లో రెండు టెస్లా సైబర్ ట్రక్కులను దుండగులు తగలబెట్టారు. దక్షిణ కొరోలినాలో టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌కు నిప్పంటించే ప్రయత్నం కూడా జరిగింది. ఇలా వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడి ఘటలను టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
Also Read..
“Tesla Cars | టెస్లా కార్లకు నిప్పు.. ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన మస్క్”
“Tesla Showroom | ఎలాన్ మస్క్‌పై తీవ్ర వ్యతిరేకత.. టెస్లా షోరూంపై కాల్పులు”
“Donald Trump | అమెరికాలో బాయ్‌కాట్ టెస్లా నినాదం.. మస్క్‌కు మద్దతుగా ట్రంప్ కీలక ప్రకటన”