Donald Trump | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖ అధిపతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. బాయ్ కాట్ టెస్లా వేళ.. మస్క్‌కు మద్దతుగా టెస్లా కారును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
ఎలాన్ మస్క్ గొప్ప అమెరికన్ అని.. యూఎస్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకోసం అతను అద్భుతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కానీ రాడికల్ లెఫ్ట్ భావజాలం కలిగిన కొందరు వ్యక్తులు కావాలనే కుట్రపూరితంగా టెస్లాను బహిష్కరించాలని ప్రయత్నిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. టెస్లా ప్రపంచంలోనే గొప్ప ఆటోమేకర్లలో ఒకటని అభివర్ణించారు. మస్క్‌కు మద్దతుగా తాను రేపు ఉదయం సరికొత్త టెస్లా కారును కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో సహాయం చేస్తున్న మస్క్‌ను ఎందుకు శిక్షించాలి..? అంటూ ట్రూత్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు టెస్లా బాస్ కూడా స్పందించారు. అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read..
Stock Markets: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డౌన్.. పడిపోయిన నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడింగ్
US Stock Market: 4 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. అమెరికా మార్కెట్ కుదేలు