వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఆ దేశంనుంచి చమురు కొనుగోళ్లు ఇలాగే కొనసాగితే న్యూఢీల్లీ భారీ సుంకాలు (Trump Tariffs) ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని మోదీ నాతో చెప్పారని, అయితే ఇంకా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చిందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఆ దేశంపై భారీ సుంకాలు విధిస్తామన్నారు. ఆదివారం రాత్రి రిపోర్టర్లతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీకు మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని భారత ప్రభుత్వం చెబుతున్నదని ట్రంప్‌ను ప్రశ్నించగా.. వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగారు. కానీ వాళ్లు అలా చేయాలనుకోరని అనుకుంటున్నానని చెప్పారు.
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని గత బుధవారం ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు రష్యాపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు పెంచాలని భావిస్తున్న అమెరికా.. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేయాలని కోరిందన్నారు. అతి త్వరలోనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రధాని మోదీ నుంచి తనకు హామీ వచ్చినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం ఖండించింది. ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది.
కాగా, భారత్‌పై జూలై 31న 25 శాతం ప్రతీకార సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో ఆగస్టు 6న మరో 25 శాతం సుంకాన్ని విధించారు. దీంతో ఆగస్టు 27ను భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. తాజాగా రష్యాతో చమురు వ్యాపారం కొనసాగిస్తే మరోసారి భారీ సుంకాలు తప్పవంటూ హెచ్చరించారు.