దావోస్, జనవరి 22 : ఆయుధాలు వీడటానికి అంగీకరించకపోతే సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా 35 దేశాల మద్దతుతో శాంతి మండలిని (పీస్ బోర్డు) ట్రంప్ లాంఛనంగా ప్రారంభించారు. పలువురు ప్రపంచ నాయకులు, ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తూ హమాస్ నిరాయుధీకరణ విషయంలో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేశారు. మరో యుద్ధాన్ని పరిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడం అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలిపారు. హమాస్ నిరాయుధీకరణే తాము కొత్తగా రూపొందించిన శాంతి మార్గదర్శకాల్లో మొదటిదని ఆయన చెప్పారు. ఆయుధాలను వదిలిపెట్టేందుకు హమాస్ అంగీకరించకపోతే సైనిక చర్య తప్పదని ట్రంప్ హెచ్చరించారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక యుద్ధాలను ముగించానని, అతి త్వరలోనే మరో పరిష్కారం రానున్నదని ఆయన చెప్పారు. ఆహ్వానం అందినప్పటికీ భారత్ సహా పలు కీలక దేశాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. చార్టర్‌పై సంతకం చేసిన దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉన్నది.
గాజాలో శాంతి స్థాపన, కాల్పుల విరమణ ఒప్పందం అమలు, పునర్నిర్మాణం, భద్రత సమన్వయం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటుచేసిన శాంతి మండలిని ట్రంప్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పత్రంపై ట్రంప్‌తోపాటు బహ్రెయిన్, మొరాకో, అజర్ బైజాన్ నాయకులు సంతకాలు చేశారు. తాను ఈ బృందానికి ప్రారంభ చైర్మన్‌గా ఉంటానని ట్రంప్ ప్రకటించారు. ఈ శాంతి మండలి అద్భుత విజయాలు సాధించగలదని ఆయన తెలిపారు. దీనికి గొప్ప సామర్థ్యం ఉందని, దీనికి సారథ్యం వహించడం తనకు గర్వకారణమని ఆయన చెప్పారు. ఈ శాంతి మండలి పూర్తిగా ఏర్పడిన తర్వాత గాజా పునర్నిర్మాణానికి తాము శాయశక్తులా కృషి చేయగలమని, అయితే ఐక్యరాజ్యసమితి(యూఎన్)తో కలసి పనిచేయాల్సి ఉంటుందని ట్రంప్ తెలిపారు. గతంలో యూఎన్‌పై పలుసార్లు విమర్శలు గుప్పించిన ట్రంప్ శాంతి మండలి విషయంలో మాత్రం సమన్వయంతో పనిచేయాలని పిలుపునివ్వడం విశేషం. శాంతి మండలి ఏర్పాటు ప్రకాశవంతమైన పశ్చిమాసియా కోసం వేసిన తొలి అడుగుగా ట్రంప్ అభివర్ణించారు.
శాంతి మండలి ఏర్పాటుపై అమెరికా మిత్రదేశాల నుంచి సైతం మిశ్రమ స్పందన లభించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేరుతారన్న ఆందోళనల నేపథ్యంలో శాంతి మండలిలో చేరడానికి బ్రిటన్ నిరాకరించింది. నార్వే, స్వీడన్ కూడా తాము చేరబోమని సంకేతాలిచ్చాయి. ఈ మండలిలో చేరేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ నిరాకరించడంతో ఫ్రెంచ్ వైన్‌పై 200 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ గతవారం హెచ్చరించారు. మరోవైపు భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత బోర్డులో చేరడంపై నిర్ణయిస్తామని రష్యా ప్రకటించింది.