Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో షాకింగ్ ప్రకటన చేశారు. ఫ్రాన్స్పై భారీగా సుంకాలు విధిస్తానని బెదిరింపులకు దిగారు. గాజా పునర్నిర్మాణం కోసం ఆయన ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరడానికి ఫ్రాన్స్ (France) నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్.. ఆదేశంపై టారిఫ్స్ బాంబ్ పేల్చారు.
ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్లపై ఏకంగా 200 శాతం టారిఫ్ (Tariffs) విధిస్తానని బెదిరింపులకు దిగారు. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) ఖచ్చితంగా దారికి వస్తాడని, బోర్డ్ ఆఫ్ పీస్ (Board of Peace) లో చేరుతాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్టు చేశారు. అంతేకాదు గ్రీన్లాండ్కు సంబంధించిన మాక్రాన్ నుంచి తనకు వచ్చిన ఓ ప్రైవేట్ సందేశాన్ని కూడా ట్రంప్ ట్రూత్ పోస్టులో పంచుకున్నారు.
గాజాలో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అమెరికా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ను ఏర్పాటు చేసింది. గాజాలో పరిస్థితిని పర్యవేక్షించడం, మానవతా సహాయం, పునర్నిర్మాణం, సంఘర్షణ నివారణకు సంబంధించిన చర్యలను ఈ బోర్డు సమన్వయం చేస్తుంది. ఇందులో చేరాలని భారత్ సహా పలు దేశాలకు ట్రంప్ ఆఫర్ చేశారు. అయితే ఈ ప్రతిపాదనపై భారత్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. భారత్ ఈ చొరవలో భాగమైతే, పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియలో తన పాత్ర మరింత బలోపేతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ బోర్డులో చేరేందుకు ఫ్రాన్స్ విముఖత వ్యక్తం చేసి.. ట్రంప్ ఆగ్రహానికి గురవుతోంది.
Also Read..
Trade Bazooka | అమెరికాపై ట్రేడ్ బజూకా అస్త్రం.. ట్రంప్ టారిఫ్లకు ఈయూ కౌంటర్!
Modi Welcomes UAE President | భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు.. స్వయంగా స్వాగతం పలికిన మోదీ