న్యూఢిల్లీ: గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్‌పై తన ఒత్తిడిని సోమవారం తీవ్రతరం చేశారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆర్కిటిక్ భూభాగంపై రష్యా ముప్పును తిప్పికొట్టడంలో డెన్మార్క్ విఫలమైందని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఆరోపించారు. ఇప్పుడు ఇక అమెరికా చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని ఆయన ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌కి రష్యా ముప్పును దూరం చేయాలని నాటో గత 20 సంవత్సరాలుగా డెన్మార్క్‌కు చెబుతున్నది. దురదృష్టవశాత్తు డెన్మార్క్ దాని గురించి ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇక అదే జరుగుతుంది అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్‌కు మద్దతు ఇస్తున్న దేశాలపై కొత్త సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ట్రంప్ నుంచి వెలువడిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాపై ట్రేడ్ బజూకాను ప్రయోగించాలని ఈయూ నిర్ణయించుకున్న తర్వాత ట్రంప్ నుంచి వెలువడిన తొలి స్పందన ఇదే కావడం విశేషం.
నోబెల్ రాలేదు.. ఇక శాంతి అక్కర్లేదు! ; నార్వే ప్రధానికి ట్రంప్ లేఖ
న్యూఢిల్లీ, జనవరి 19: ప్రపంచంలో 8 యుద్ధాలను ఆపినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించలేదని వాపోతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు ఓ లేఖ రాసినట్లు తెలిసింది. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని, గ్రీన్లాండ్ స్వాధీనంపై తాను ఇస్తున్న హెచ్చరికలను ట్రంప్ ముడిపెడుతూ తాను ఇక శాంతి గురించి మాత్రమే ఆలోచించలేనని స్పష్టంచేస్తూ ఆర్కిటిక్ భూభాగాన్ని ఆక్రమించుకోవడమే తన ముఖ్య ప్రాధాన్యతగా ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. గ్రీన్లాండ్ ద్వీపంపై డెన్మార్క్ యాజమాన్య హక్కును కూడా ట్రంప్ సవాలుచేశారు. అయితే, నోబెల్ శాంతి బహుమతిని ఎంపిక చేసేది నార్వే ప్రభుత్వం కాదని, అదో స్వతంత్ర కమిటీ అన్న విషయాన్ని ట్రంప్ విస్మరించడం విచిత్రం. ఎనిమిదికిపైగా యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వకూడదని మీ దేశం నిర్ణయించుకోవడంతో ఇక శాంతి గురించి మాత్రమే ఆలోచించరాదని తాను భావిస్తున్నట్లు నార్వే ప్రధానికి రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. శాంతి స్థాపన తన ఆలోచనల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తాను అమెరికాకు ఏది మంచో దాని గురించే ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు.
నెక్ట్స్ టార్గెట్ కెనడా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కెనడాపై దృష్టి సారించారు. కెనడా ప్రధాన మంత్రిగా మైక్ కార్నీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగైనట్లు కనిపించింది. కానీ ట్రంప్ పూర్తి సంతృప్తిగా లేనట్లు తెలుస్తున్నది. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడాను మార్చుకోవాలనే ఆకాంక్షను ఆయన వదులుకోలేదని అంటున్నారు. తాజా కథనాల ప్రకారం, కెనడా ఆక్రమణ కోసం ట్రంప్ ఓ రహస్య ప్రణాళికను రచించారు. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం ట్రంప్ చెప్తున్న సాకులనే కెనడా విషయంలో కూడా చూపించబోతున్నారు. ఆర్కిటిక్ భద్రత, రష్యా, చైనా వల్ల ముప్పు వంటి వాటిని చూపించి, కెనడాను స్వాధీనం చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.. రష్యా, చైనాలను కెనడా ఎదుర్కొనగలగడంపై ట్రంప్ తన సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.