Trade Bazooka | న్యూఢిల్లీ, జనవరి 19: గ్రీన్‌లాండ్‌ని బలపరుస్తున్న యూరోపియన్ దేశాలపై కొత్త సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దరిమిలా 27 సభ్యదేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) మొట్టమొదటిసారి అమెరికాపై శక్తివంతమైన వాణిజ్య ప్రతీకార ఆయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధపడింది. ఈ పరిణామంతో అమెరికా, యూరపు మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య బజూకాను ప్రయోగించాలని ఈయూ మొట్టమొదటిసారి నిర్ణయించుకుంది. గ్రీన్‌లాండ్‌కి మద్దతు ఇస్తున్న ఈయూ సభ్య దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, బ్రిటన్‌పై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు శనివారం ట్రంప్ ప్రకటించారు.
అమెరికా భద్రతకు డానిష్ భూభాగమైన గ్రీన్లాండ్ అత్యంత కీలకమని వాదిస్తున్న ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై ఒప్పందానికి రాకపోతే జూన్ 1 నుంచి సుంకాలను 25 శాతానికి పెంచుతానని కూడా హెచ్చరించారు. ఈ యూరోపియన్ దేశాలు గ్రీన్లాండ్కు మద్దతు ప్రకటించిన వెంటనే ట్రంప్ నుంచి ఈ రకమైన హెచ్చరికలు వెలువడడంతో అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య వివాదం కొత్త మలుపు తీసుకుంది. దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిన ట్రంప్ హెచ్చరికలపై వేగంగా స్పందించిన యూరోపియన్ దేశాల ప్రతినిధులు ఆదివారం బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యారు. అమెరికా-ఈయూ సంబంధాల భవిష్యత్ పరిణామాలను, తక్షణం తీసుకోవలసిన చర్యలను ఈ సమావేశంలో చర్చించారు. అత్యవసర సమావేశం అనంతరం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ విలేకరులతో మాట్లాడుతూ మొట్టమొదటిసారి అమెరికాపై ఈయూ తన ట్రేడ్ బజూకాను ప్రయోగించవలసిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు.
ట్రేడ్ బజూకా అంటే..
ట్రేడ్ బజూకా అనేది బలప్రయోగాన్ని ఎదుర్కొనే సాధనాన్ని(ఏసీఐ) సూచిస్తుంది. బయటి దేశాల నుంచి ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఈయూ రూపొందించిన ఓ యంత్రాంగం ఇది. అమెరికాపై ఎదురు సుంకాలు విధించడానికి, లాభదాయకమైన ఈయూ కాంట్రాక్టులపై బిడ్డింగ్ వేయకుండా అమెరికన్ కంపెనీలను నిరోధించడానికి ఏసీఐ అనుమతిస్తుంది. తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే ఉద్దేశం ఈయూకు ఉందన్న స్పష్టమైన సందేశాన్ని అమెరికాకు పంపడమే లక్ష్యంగా ఈ చర్యలను ఈయూ చేపట్టనున్నది. ట్రేడ్ బజూకా సుంకాలకే పరిమితం కాదని, అదనపు ఆంక్షలు కూడా ఉంటాయని అధికారులు వెల్లడించారు. గతంలో అమెరికాపై ప్రకటించిన 9300 కోట్ల యూరోల ప్రతీకార సుంకాలను విధించే అంశాన్ని కూడా ఈయూ పరిశీలిస్తుందని కూడా రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితిని ఊహించనిదిగా అభివర్ణించిన యూరోపియన్ దౌత్యవేత్తలు తాము ఈ నిర్ణయం తీసుకోవడానికి గతంలో అమెరికాతో ఉన్న వివాదాలు ప్రేరేపించలేదని స్పష్టం చేశారు. అమెరికా-ఈయూ చర్చలపైనే తదుపరి చర్యలు ఉండగలవని ఈయూ నాయకులు తెలిపారు. ఈయూ చర్యలు చాలా వేగంగా ఉంటాయని వారు స్పష్టం చేశారు.
గ్రీన్లాండ్కు సంఘీభావం: ఈయూ
ట్రంప్ సుంకాల హెచ్చరికలకు స్పందనగా గ్రీన్లాండ్కు సంఘీభావం ప్రకటిస్తూ 8 యూరోపియన్ దేశాలు ఆదివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. డచ్ రాజ్యానికి, గ్రీన్లాండ్ ప్రజలకు తమ పూర్తి సంఘీభావంతో ఉన్నట్లు ప్రకటనలో స్పష్టం చేశాయి. నాటో సభ్యులుగా ఆర్కిటిక్‌లో భద్రతా ప్రయోజనాలు పంచుకుంటామని స్పష్టం చేస్తూ ఆర్కిటిక్ భద్రతను ఉమ్మడి అమెరికా-ఈయూ ప్రాధాన్యతగా బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలను రక్షించేందుకు కఠిన వైఖరిని ఈయూ తీసుకుంటుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ప్రకటించారు. ట్రంప్ విధించిన తాజా సుంకాలు ఈయూ-అమెరికా సంబంధాలను దెబ్బతీయగలవని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా దెర్ లేయెన్ హెచ్చరించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా అధ్యక్షుడి చర్యను విమర్శిస్తూ గ్రీన్‌లాండ్‌పై పట్టుకోసం నాటో మిత్రులపై సుంకాలు ప్రయోగించడం తప్పుడు నిర్ణయం అని, ఈయూ-అమెరికా మధ్య సంబంధాలను ఇది అస్థిరపరచగలదని హెచ్చరించారు.