Donald Trump | అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ (New York Times)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఆ పత్రిక తనపై అబద్దాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికపై 15 బిలియన్ డాలర్ల నష్టం (రూ.1.32 లక్షల కోట్లు) దావా వేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
‘నేడు దేశ చరిత్రలో అత్యంత చెత్త, అత్యంత దిగజారిన వార్తా పత్రికల్లో న్యూయార్క్ టైమ్స్ ఒకటి. అది రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్‌పీస్‌గా మారింది. ఇప్పటి వరకూ జరిగిన అతిపెద్ద చట్టవిరుద్ధ ప్రచార విరాళంగా నేను దీన్ని భావిస్తున్నాను. అందుకే ఈ పత్రిక అధ్యక్ష పోటీల్లో నా ప్రత్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా నిలిచింది. ఆ పత్రిక దశాబ్దాలుగా నాపై అబద్దాలను ప్రచారం చేస్తోంది. అంతేకాదు నా కుటుంబం, వ్యాపారాలు, అమెరికాపై కూడా అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది. ఆ పత్రికపై 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం, అపవాదు దావా వేసే గొప్ప అవకాశం నాకు దక్కింది’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
కాగా, ట్రంప్‌కు వ్యతిరేకంగా న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయంటూ ఆ పత్రిక ప్రచురించిన కథనం సంచలనం రేపింది. ఈ కథనాల నేపథ్యంలో ట్రంప్ ఆ పత్రికపై దావా వేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.
Also Read..
Ozone Layer: కోలుకుంటున్న ఓజోన్ పొర .. గుడ్ న్యూస్ చెప్పిన ఐక్యరాజ్యసమితి
TikTok | అమెరికాలో టిక్‌టాక్ సేవలు.. చైనాతో కీలక డీల్ కుదిరిందంటూ ట్రంప్ ప్రకటన