న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి శుభవార్త చెప్పింది. భూమికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొర కోలుకుంటున్నట్లు(Ozone Layer Healing) వెల్లడించింది. రానున్న దశాబ్ధాల్లో ఆ ఓజోన్ రంధ్రం పూర్తిగా మూసుకుపోనున్నట్లు యూఎన్ తన నివేదికలో పేర్కొన్నది. అంతర్జాతీయ దేశాల నిరంతర చర్యల వల్ల ఈ సక్సెస్ సాధ్యమైనట్లు యూఎన్ తెలిపింది. యూఎన్ వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్ దీనిపై కొత్త నివేదికను రిలీజ్ చేసింది. అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ రంధ్రం గతంతో పోలిస్తే 2024లో చిన్నగా ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఓజోన్ పొర కోలుకుంటోందన్నారు. శాస్త్రవేత్తలు ఇచ్చిన హెచ్చరికలు పనిచేసినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ప్రగతి సాధ్యమవుతోందన్నారు. ఓజోన్ బులెటిన్ 2024ను ప్రపంచ వాతావరణ సంస్థ పబ్లిష్ చేసింది. సహజసిద్ధమైన పరిణామాల వల్ల ఓజోన్ పొర సన్నగిల్లడం నిలిచిపోయినట్లు పేర్కొన్నది. కానీ దీర్ఘకాలంగా ఆలోచిస్తే, అది శాస్త్రవేత్తల ఘనతగా తెలిపారు. క్లోరోఫ్లోరో కార్బన్స్ వినియోగంపై అంతర్జాతీయంగా వత్తిడి తేవడం వల్లే ఓజోన్ పొర బలహీనపడడం ఆగినట్లు చెప్పారు.
వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా బులెటిన్ రిలీజ్ చేశారు. వియన్న కన్వెన్షన్ 40వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఆ నాటి సదస్సులో ప్రపంచ దేశాలు ఓజోన్ పొర సన్నగిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1975లో ఆ కన్వెన్షన్ జరిగింది. ఆ తర్వాత 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ రిలీజ్ చేశారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, ఏరోసోల్ స్ప్రేస్లో ఓజోన్ పొరను బలహీనపరిచే పదార్ధాల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఓజోన్ పొర రికవరీ ట్రాక్‌లో ఉందన్నారు. ఈ శతాబ్ధం మధ్య కాలం వరకు .. 1980 తరహా స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుందని అంచనా వేశారు. దీని వల్ల స్కిన్ క్యాన్సర్లు, క్యాటరాక్టులు తగ్గుతాయన్నారు. అతినీలలోహిత కిరణాల వల్ల జరిగే నష్టాలు నివారించబడుతాయని రిపోర్టులో తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 29న అంటార్కిటికా వద్ద ఓజోన్ పొర 46.1 మిలియన్ టన్నుల మాస్ డెఫిసిట్‌తో ఉందని, ఇది 1990-2020 దశకంతో పోలిస్తే తక్కువ అని రిపోర్టులో పేర్కొన్నారు.