Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచారు. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు (Steel), అల్యూమినియం (Aluminum) దిగుమతులపై 25 శాతం సుంకాలను (25 Percent Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం న్యూఓర్లియన్స్కు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఈ మేరకు ప్రకటన చేశారు. మంగళవారం నాటికి వీటిపై పరస్పర సుంకాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత అవి వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను విధించారు. కానీ, కెనడా, మెక్సికో, బ్రెజిల్ సహా పలు వాణిజ్య భాగస్వామ్యలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్.. ఈ కోటాను కొనసాగించారు. ప్రస్తుతం అమెరికా ఉక్కు దిగుమతుల్లో సింహభాగం కెనడా, మెక్సికో, బ్రెజిల్ నుంచే జరుగుతాయి. ఆ తర్వాత దక్షిణ కొరియా, వియత్నాం ఉన్నాయి. ఇక, అల్యూమినియం విషయానికి వస్తే అమెరికాకు అతిపెద్ద సరఫరాదారుగా కెనడా ఉంది. దీనిని ఎగుమతి చేసి భారీగానే కెనడా లబ్ది పొందుతోంది. 2024లోని మొదటి 11 నెలల్లో మొత్తం అల్యూమినియం దిగుమతుల్లో 79 శాతం కెనడా నుంచే వచ్చింది. ఆ తర్వాతి స్థానం మెక్సికోదే. అయితే, ట్రంప్ తాజా నిర్ణయం ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఉంటుందన్నదానిపై మాత్రం స్పష్టతలేదు.
Also Read..
Supersonic Aircraft | సూపర్ సానిక్ విమానాల పునరాగమనం?.. ఆ సమస్యలను అధిగమించేనా?
Beavers | బ్రిడ్జి నిర్మించిన ఎలుకలు.. ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఆదా అయ్యాయంటే?
Bangladesh | బంగ్లాదేశ్లో ఆపరేషన్ డెవిల్ హంట్.. హసీనా విధేయులపై ప్రభుత్వం ఉక్కుపాదం