Supersonic Aircraft | న్యూయార్క్, ఫిబ్రవరి 9: 20వ శతాబ్దం నాటి సూపర్‌సానిక్ విమానాలు మళ్లీ రానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అమెరికాకు చెందిన ‘బూమ్’ కంపెనీ సూపర్‌సానిక్ విమానం ఎక్స్‌బీ-1ను గతవారం విజయవంతంగా ప్రయోగించింది. 2003లో కాన్కార్డ్ సూపర్‌సానిక్ విమానం నిష్క్రమించిన తర్వాత ధ్వని కంటే వేగంగా ప్రయాణించిన మిలటరీ రహిత తొలి విమానం ఇదే కావడం విశేషం. 2029 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కీలకమైన మొదటి అడుగును బూమ్ విజయవంతంగా వేసింది.
విమానాల స్పీడ్‌ను మాక్ నంబర్లలో కొలుస్తారు. ధ్వని కంటే వేగంగా ప్రయాణించే విమానాలను సూపర్ సానిక్ అంటారు. వీటి మాక్ నంబర్ 1 కంటే ఎక్కువ. సాధారణ ప్యాసింజర్ విమానాలు ధ్వని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. మాక్ 0.8 స్పీడ్‌తో ప్రయాణించే వీటిని సబ్‌సానిక్ విమానాలు అంటారు. అయితే, బూమ్ కంపెనీ ఓవర్చర్ పేరిట అభివృద్ధి చేస్తున్న సూపర్‌సానిక్ విమానం స్పీడ్ 1.7 మాక్ కావడం గమనార్హం. న్యూయార్క్ నుంచి రోమ్కు వెళ్లేందుకు సాధారణంగా 8 గంటల సమయం పడుతుంది. కానీ, ఓవర్చర్లో 4 గంటల 40 నిమిషాలకే చేరుకోవచ్చని కంపెనీ చెబుతున్నది.
సూపర్‌సానిక్ విమానాలు కొత్తవేమీ కావు. 20వ శతాబ్దంలోనే వీటిని ఆవిష్కరించారు. బ్రిటిష్ ఎయిర్వేస్, ఎయిర్ ఫ్రాన్స్ 1976-2003 మధ్యకాలంలో కాన్కార్డ్ పేరిట సూపర్‌సానిక్ విమానాన్ని నడిపించాయి. మాక్ 2 వేగంతో ప్రయాణించే దీని కెపాసిటీ 128 మంది. ఇది న్యూయార్క్ నుంచి లండన్‌కు మూడు గంటల్లోనే చేరుకునేది. అయితే, ఖరీదైన ఈ విమానంలో సంపన్నులు మాత్రమే ప్రయాణించేవారు. దీనితో పాటు రష్యాకు చెందిన టుపోలెవ్-144 కూడా ఉండేది. కానీ, 1974లో నిర్వహించిన ఓ ఎయిర్ షోలో టుపోలెవ్ టీయూ-144 ప్రమాదానికి గురైంది. దీంతో వీటి భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అదే సమయంలో బోయింగ్ 747 లాంటి అతి చౌకైన విమానాలు కమర్షియల్ సర్వీస్‌లోకి రావడంతో సూపర్‌సానిక్ కొనుగోళ్లపై ఎయిర్‌లైన్ కంపెనీలు ఆసక్తి చూపలేదు.
సూపర్‌సానిక్ విమానాలు ఇప్పుడు మనుగడ సాగించాలంటే గతంలో కాన్కార్డ్ ఎదుర్కొన్న పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది సానిక్ బూమ్. ధ్వని కంటే వేగంగా ప్రయాణించే ఈ విమానాల నుంచి వెలువడే ధ్వని సానిక్ బూమ్ అత్యంత వేగంగా భూమికి చేరుకుంటుంది. కొన్నిసార్లు సానిక్బూమ్ వల్ల ఇండ్లు, కిటికీలు, అద్దాలు పగులుతాయి. ఈ కారణంగానే ఒకానొక సమయంలో సూపర్‌సానిక్ ప్యాసింజర్ విమానాల ల్యాండింగ్‌ను యూఎస్ నిషేధించింది. ఈ ప్రభావం కాన్కార్డ్ మార్కెట్‌పై పడింది. ఇప్పుడు ఈ సమస్యను అధిగమించాల్సి ఉంది. కాన్కార్డ్ను అల్యూమినియంతో తయారు చేశారని, ప్రస్తుతం మోడర్న్ ఎయిరోస్పేస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయని, కాన్కార్డ్ ఎదుర్కొన్న సమస్యలు అధిగమిస్తామని బూమ్ ధీమా వ్యక్తంచేసింది.