Core 5 | రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలపై అధిక టారిఫ్‌లు, వలసలు, హెచ్1బీ వీసా వంటి వాటిపై కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో కలిసి ఓ శక్తిమంతమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. C5 లేదా కోర్ 5 పేరుతో ఈ కూటమిని (Core 5 Group) ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఇప్పటికే ఉన్న జీ7 కూటమి లానే సీ5ని తెరపైకి తెచ్చే యోచనలో ట్రంప్ ఉన్నట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ మీడియా సంస్థ ‘పొలిటికో’ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా, భారత్, రష్యా, చైనా, జపాన్‌తో ఈ సీ5 కూటమిని ఏర్పాటు చేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు సదరు కథనం పేర్కొంది. సంపద, ప్రజాస్వామ్య పాలన వంటి జీ7 నిబంధనలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోని ప్రధాన సైనిక, ఆర్థిక, జనాభా శక్తిగా ఉన్న దేశాలతో ఈ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే, ఈ కొత్త కూటమిలో యూరప్ దేశాలకు చోటు లేకపోవడం గమనార్హం. మరోవైపు ఈ కథనాలను వైట్‌హౌస్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లీ స్పష్టం చేశారు. కానీ, జాతీయ భద్రతా నిపుణులు మాత్రం ఇది ట్రంప్ మార్క్ ఆలోచనేనని చెబుతున్నారు. C5ని అమెరికా వ్యూహాత్మక ఆలోచనకు అనుగుణంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ట్రంప్ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ చెబుతున్నారు.
Also Read..
UK Museum | బ్రిటన్ మ్యూజియంలో భారీ దొంగతనం.. విలువైన భారతీయ కళాఖండాలు మాయం
US Embassy | డెలివరీ కోసమా.. అయితే వీసాలివ్వం : యూఎస్ ఎంబసీ
9 కోట్లు కట్టు.. గోల్డ్ కార్డు పట్టు!.. అమెరికాలో శాశ్వత నివాసానికి రాజమార్గం!