వాషింగ్టన్, డిసెంబర్ 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ట్రంప్ గోల్డ్ కార్డును అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ఖరీదు 10 లక్షల డాలర్లు (దాదాపు రూ. 8.97 కోట్లు). కంపెనీలు మాత్రం 20 లక్షల డాలర్లు ( దాదాపు రూ. 18 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ కార్డు పేరిట కొత్త వీసా ప్రోగ్రామ్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు. తొలుత దీని ఖరీదు 50 లక్షల డాలర్లు(రూ. 44 కోట్లు)గా అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తర్వాత దీని ధరను 10 లక్షల డాలర్లకు ప్రభుత్వం తగ్గించింది. గురువారం అధికారికంగా ట్రంప్ గోల్డ్ కార్డును ప్రారంభించిన ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రంప్ గోల్డ్ కార్డు ద్వారా వచ్చే డబ్బంతా అమెరికా ప్రభుత్వానికి వెళుతుందని, తమ దేశంలోకి గొప్ప వ్యక్తులను తీసుకువచ్చేందుకు ఇది ఓ బహుమతని అన్నారు. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల డాలర్లను ఈ కార్డు తీసుకువస్తుందని కూడా ఆయన చెప్పారు.
గోల్డ్ కార్డు ప్రత్యేకతలు
అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్ కార్డుదారులకు లభించే ప్రత్యేక సౌకర్యాలు, అధికారాలు గోల్డ్ వీసా కార్డుదారులకు కూడా లభిస్తాయి. సుదీర్ఘకాలం నివసించేందుకు, పని చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఒక విధంగా అమెరికా పౌరసత్వానికి ఈ కార్డు రాజమార్గం లాంటిందని చెప్పవచ్చు. సంప్రదాయ వీసాలు లేదా గ్రీన్ కార్డుల తరహాలో కాకుండా సంపన్న పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు లేదా అత్యున్నత నిపుణులను ఆకట్టుకునేందుకు ఈ కార్డును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రీన్ కార్డు కోసం సుదీర్ఘకాల, క్లిష్టమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేగాక అది లభించాలంటే కనీసం 10-15 ఏళ్లు ఎదురుచూడాల్సి ఉంటుంది. ట్రంప్ గోల్డ్ కార్డుతో వేగంగా, సులభంగా శాశ్వత నివాసాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది.
భారత్‌కు వెళితే ఉద్యోగాలు కోల్పోతారు ; హెచ్-1బీ వీసాదారులకు నిపుణుల హెచ్చరిక
డిసెంబర్లో జరగవలసిన వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌కు వాయిదా వేస్తూ భారత్‌లోని అమెరికన్ కాన్సులర్ కార్యాలయాలు చివరి నిమిషంలో మెసేజ్‌లు పంపిన నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో భారతీయ హెచ్-1బీ వీసాదారులు భారత్‌కు ప్రయాణించవద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచించారు. అమెరికా వెలుపల సుదీర్ఘకాలం వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు అమెరికన్ కంపెనీలు చట్టపరంగా అనుమతించని కారణంగా హెచ్-1బీ వీసాదారులు విదేశాలకు ప్రయాణం పెట్టుకుని తమ ఉద్యోగాలకు ముప్పు తెచ్చుకోవద్దని వారు హెచ్చరించారు. డిసెంబర్లో జరగవలసి ఉన్న వీసా ఇంటర్వ్యూల కోసం ఇప్పటికే భారత్‌కు వందలాది మంది హెచ్-1బీ వీసాదారులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో ఇంటర్వ్యూలు వాయిదాపడినట్లు వారికి మెసేజ్‌లు అందాయి. దీంతో వీసా దరఖాస్తుదారుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, డిపెండెంట్ వీసాలపై ఉన్న వారి కుటుంబ సభ్యుల సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయడం ప్రారంభిస్తామని గతవారం అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన వారం తర్వాత భారత్‌లోని అమెరికన్ కాన్సులర్ ఆఫీసులు వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌కు వాయిదా వేసినట్లు ప్రకటించాయి.
బిడ్డను కని పౌరసత్వం అడిగితే కుదరదు! ; వీసా దరఖాస్తుదారులకు అమెరికా హెచ్చరిక
పర్యాటక వీసాపై తమ దేశానికి వచ్చి పౌరసత్వం కోసం కావాలని బిడ్డను కంటామంటే ఒప్పుకోబోమని అమెరికా స్పష్టంచేసింది. ఈ మేరకు భారత్‌లోని ఆ దేశ దౌత్య కార్యాలయం గురువారం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. అలాంటి ఉద్దేశం గల పర్యాటకుల దరఖాస్తులను ప్రాసెస్ చేయబోమని చెప్పింది. ‘అమెరికాకు ప్రయాణించడంలో వారి ప్రాథమిక ఉద్దేశం అక్కడ బిడ్డకు జన్మనివ్వడం ద్వారా మా దేశ పౌరసత్వం పొందడమే అని మా కాన్సులర్ అధికారులు నమ్మితే వారి పర్యాటక వీసాకు అనుమతి ఇవ్వం’ అని ఎంబసీ పేర్కొంది. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల్లో అమెరికా వ్యతిరేక సమాచారం కనిపిస్తే వారి వీసా దరఖాస్తును తిరస్కరిస్తామని ఇటీవలే ఆ దేశ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.