వాషింగ్టన్: గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా గుంజుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. డెన్మార్క్ నుంచి విడిపోయి, అమెరికాతో కలవాలని ఈ దీవి ప్రజలను ఒప్పించాలని యోచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇక్కడ నివసిస్తున్న సుమారు 57,000 మందికి భారీగా డబ్బును ఎరగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఒక్కొక్కరికి 10,000 డాలర్ల నుంచి 1,00,000 డాలర్ల వరకు (సుమారు రూ.8 లక్షల నుంచి రూ.89 లక్షలు) ఇవ్వజూపేందుకు అధికారులు చర్చించినట్లు తెలిపింది.
ఇదిలావుండగా, ఆర్కిటిక్‌లోని డానిష్ ప్రాంతంపై దాడికి పాల్పడే వారిపై తమ సైనికులు తక్షణమే కాల్పులు జరుపుతారని, ఆ తర్వాత ప్రశ్నలు అడుగుతారని డెన్మార్క్ గురువారం హెచ్చరించింది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవలసిన అవసరం ఉందని ట్రంప్ పునరుద్ఘాటించిన తర్వాత గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ ఫేస్బుక్లో స్పందిస్తూ.. “ఇక చాలు.. కలుపుకోవడం గురించి ఇక ఫాంటసీలు వద్దు” అని ట్రంప్‌నకు హితవు పలికారు.
అనేక కారణాల వల్ల గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవలసిన అవసరం ఉందని ట్రంప్ చాలా కాలం నుంచి చెప్తున్నారు. ఇక్కడ అడ్వాన్స్డ్ మిలిటరీ అప్లికేషన్స్ కోసం అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉండటం ఒక కారణమని తెలిపారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడంపై ట్రంప్ సహాయకుల మధ్య చర్చలు ఆయన రెండోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందే ప్రారంభమయ్యాయి. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసిన తర్వాత గ్రీన్లాండ్ స్వాధీనం మరింత అత్యవసరంగా మారిందని వైట్ హౌస్ వర్గాలను ఉటంకిస్తూ అమెరికన్ వార్తా సంస్థ తెలిపింది. ఒక్కొక్కరికీ 1 లక్ష డాలర్లు చెల్లిస్తే, మొత్తం 6 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని, ఇది ఆచరణ సాధ్యమేనని వీరు చెప్తున్నారు.
గ్రీన్లాండర్స్లో అత్యధికులు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నట్లు పోల్స్ చెప్తున్నాయి. డెన్మార్క్ నుంచి విడిపోతే ఆర్థిక వ్యయాలతోపాటు అనేక సమస్యలు ఉంటాయని గ్రీన్లాండ్ లెజిస్లేటర్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇండిపెండెన్స్ రిఫరెండం కోసం పిలుపు ఇవ్వడం లేదు. మరోవైపు డెన్మార్క్ నుంచి విడిపోవడానికి గ్రీన్‌లాండర్స్ ఇష్టపడుతున్నప్పటికీ, అమెరికాతో కలవడానికి మాత్రం నిరాకరిస్తున్నారు.