AI – Video | అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ యూఎస్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ (Elon Musk) మొదటి నుంచి తన పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ట్రంప్‌ను మస్క్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈ ఇంటర్వ్యూకి విశేష స్పందన లభించింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ట్రంప్ – మస్క్ కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ పాప్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీ గీస్’ (Bee Gees) బృందం చేసిన ర్యాప్ సాంగ్ ‘స్టేఇన్ అలైవ్’ (Stayin Alive) అంటూ సాగే పాటకు ట్రంప్, మస్క్ కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. అయితే, అది నిజమైన వీడియో కాదు. కృత్రిమ మేధతో సృష్టించిన వీడియో. ట్రంప్‌తో మస్క్ ఇంటర్వ్యూ వేళ ఈ వీడియో బయటకు వచ్చింది. దీన్ని ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మమ్మల్ని విద్వేషించే వాళ్లు దీన్ని ఏఐ అని చెబుతారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Haters will say this is AI 🕺🕺 pic.twitter.com/vqWVxiYXeD
— Elon Musk (@elonmusk) August 14, 2024
ట్రంప్‌తో ఇంటర్వ్యూ.. సైబర్ దాడి జరిగిందన్న మస్క్
కాగా, ట్రంప్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సైబర్ దాడి జరిగినట్లు ఎలాన్ మస్క్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్యా సోమవారం రాత్రి సుదీర్ఘమైన చర్చ జరిగింది. కానీ ఆ షో 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. ఎక్స్ యూజర్లు ఆ ఇంటర్వ్యూను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. తమపై డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ (డీడీఓఎస్) అటాక్ జరిగినట్లు మస్క్ తెలిపారు. తమ డేటా లైన్లు అన్నీ నిర్వీర్యం అయినట్లు పేర్కొన్నారు. రెండు గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో ట్రంప్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు మస్క్. రిపబ్లికన్ ప్రచారానికి మద్దతు పలకాలని ఆయన ఓటర్లను కోరారు.
ఎక్స్ అకౌంట్లపై డీడీఓఎస్ దాడులు జరిగాయని, దాని వల్ల వెబ్సైట్ ఓవర్‌లోడ్ అవుతుందని, దాంతో ఆ సైట్ యాక్సెస్ ఇబ్బంది అవుతుందని మస్క్ తెలిపారు. సైబర్ దాడి జరిగిదంటే.. ట్రంప్‌కు వ్యతిరేకత ఉందని అర్థం అవుతుందని ఆయన చెప్పారు. డీడీఓఎస్ దాడివల్ల.. ఒక్కసారిగా భారీ సంఖ్యలో సిగ్నల్స్ వస్తాయని, దీంతో ఆ లైన్ డిస్టర్బ్ అవుతుందని సింగపూర్ సైబర్‌స్పేస్ డైరెక్టర్ ఆంథోనీ లిమ్ తెలిపారు.
Also Read..
Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో మహేశ్ బాబు కుటుంబం
PM Modi | మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి : ప్రధాని మోదీ