వాషింగ్టన్: భారత దేశం నుంచి డంకీ రూట్లో అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారులు మునుపెన్నడూ లేనన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో చట్టవిరుద్ధ వలసదారుల సంఖ్యను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉండటమే దీనికి కారణం. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సమాచారం ప్రకారం, అరెస్టయిన చట్టవిరుద్ధ భారతీయ వలసదారుల సంఖ్య నిరుడు డిసెంబరులో 5,600.
ఈ సంఖ్య ఈ సంవత్సరం జనవరిలో 3,132; ఫిబ్రవరిలో 1,628. ఈ ఏడాది జనవరి 20న దేశాధ్యక్ష పదవిని చేపట్టిన ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తుండటంతో స్మగ్లర్లు కూడా వారిని డంకీ రూట్లో తీసుకెళ్లడంపై పవెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులు, వారి పిల్లలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు.
ఇటీవల మిలిటరీ విమానాల్లో సంకెళ్లు వేసి మరీ అక్రమ వలసదారులను భారత దేశానికి పంపించడంతో, వీరంతా క్షణ క్షణం భయం భయంగా గడుపుతున్నారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిరిగి పంపించే ఏర్పాట్లు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.