గురువారం 21 జనవరి 2021
International - Jan 01, 2021 , 11:18:45

హెచ్‌1బీ వీసాల‌పై నిషేధం పొడిగించిన ట్రంప్‌

హెచ్‌1బీ వీసాల‌పై నిషేధం పొడిగించిన ట్రంప్‌

వాషింగ్ట‌న్‌: వ‌ల‌స కార్మికుల‌పై ఉన్న నిషేధాన్ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ పొడిగించారు. అమెరికాలో వ‌ర్క్ వీసాల‌పై ఉన్న తాత్కాలికంగా నిషేధాన్ని మార్చి 31 వ‌ర‌కు పొడిగిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.  దేశంలోకి ఇమ్మిగ్రాంట్ల‌ను నిలువ‌రించేందుకు ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ట్రంప్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతారు. ఆ త‌ర్వాత ఆ దేశ నూత‌న అధ్య‌క్షుడిగా బైడెన్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.  ట్రంప్ అధికారం చేజిక్కించుకున్న తొలి రోజు నుంచే వ‌లస కార్మికుల‌పై ఆంక్ష‌లు అమ‌లు చేశారు.  ముస్లిం దేశాల నుంచి వ‌స్తున్న వారిపై ఆయ‌న ట్రావెల్ బ్యాన్ విధించారు. వైట్‌హౌజ్‌లో చివ‌రి రోజులు గ‌డిపే వ‌ర‌కు కూడా ట్రంప్ ఆ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తూ వ‌చ్చారు.

గ‌త ఏడాది ఏప్రిల్‌, జూన్ నెల‌ల్లో ఇమ్మిగ్రాంట్ల‌పై నిషేధం విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆ ఆదేశాలు అమ‌లులో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు ట్రంప్ పొడిగించారు. వ‌ల‌స కార్మికుల‌పై బ్యాన్ వ‌ల్ల‌.. గ్రీన్ కార్డు ద‌ర‌ఖాస్తుదారుల్ని ఆపేస్తారు.  తాత్కాలిక విదేశీ వ‌ర్క‌ర్ల‌ను కూడా దేశంలోకి ఎంట్రీ కానివ్వ‌రు.  క‌రోనా మ‌హ‌మ్మారితో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స్థిరీక‌రించేందుకు ఇమ్మిగ్రేష‌న్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు గ‌తంలో ట్రంప్ తెలిపారు.  నిషేధానికి గురైన‌వారిలో హెచ్‌1-బీ వీసాదారులు, వ‌ర్క్ వీసాదారులు, గ్రీన్ కార్డు హోల్డ‌ర్లు ఉన్నారు. 


logo