Toilet Tax | షిమ్లా, అక్టోబర్ 3: ఉచితాల పేరుతో ఊదరగొట్టి హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రజలు చెంబట్క పోయేందుకు కూడా భయపడే పరిస్థితులు తీసుకొచ్చింది. అలవికాని హామీలు అమలు చేసేందుకు ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఆఖరికి మరుగుదొడ్లపైనా పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా బహిరంగ మల విసర్జనను నిర్మూలించడానికి ప్రభుత్వాలు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రజలకు నిధులు మంజూరు చేస్తాయి. కానీ, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారు మాత్రం తిరోగమన దిశలో వెళ్తున్నది. మరుగుదొడ్లు నిర్మించుకోవడమే ప్రజలు చేసిన తప్పు అన్నట్టుగా భారం మోపుతున్నది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఉద్యోగులకు సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి కాంగ్రెస్ సర్కారు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు ఇంతవరకు వినని టాయ్‌లెట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. మరుగుదొడ్లపై పన్నులను వసూలు చేయాలని గురువారం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో టాయ్‌లెట్ సీటుకి నెలకు రూ.25 చొప్పున ప్రజల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఎన్ని టాయ్లెట్లు ఉంటే అన్నింటికీ ఈ పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇంతకుముందు ఇక్కడ నీటి బిల్లులు కూడా ఉండేవి కాదు. ఈ నెల నుంచే ప్రభుత్వం నెలకు రూ.100 చొప్పున నీటి బిల్లును అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో రూ.30 సీవరేజి బిల్లు కాగా, మిగతాది నీటి వినియోగానికి విధిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపు 10 లక్షల మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిపై ఈ కొత్త పన్నుల భారం పడనుంది.