మోర్తాడ్, జూన్ 19 : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఎక్కడినుంచి ఏ బాంబు దూసుకొస్తుందో తెలియక భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. వారం రోజులుగా రెండు దేశాలు వందలాది క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్న తరుణంలో తెలుగు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఉపాధి కోసం తెలంగాణ నుంచి సుమారు 800 మంది వరకు ఇజ్రాయెల్ వెళ్లారు. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 200 మంది ఉన్నారు. వీరంతా ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ పట్టణంలోని రమాద్గాన్ అనే ఏరియాలో ఉంటున్నారు. అయితే, గత 20 ఏండ్లుగా ఎప్పుడూ చూడని పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్‌లో ఉంటున్న తెలంగాణ బిడ్డలు వాపోతున్నారు. ఈ స్థాయిలో బాంబుల దాడులు, క్షిపణుల దాడులు ఎన్నడూ చూడలేదని చెప్తున్నారు.
రోజంతా పనులు చేసుకుంటున్నప్పటికీ సాయంత్రమైందంటే పరిస్థితి ఎట్లా ఉంటదో తెలియట్లేదని, ఎప్పుడు తింటున్నామో, ఎప్పుడు నిద్రిస్తున్నమో తెలియడం లేదని ఇజ్రాయెల్‌లో ఉంటున్న తెలంగాణవాసులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రమైందటే చాలు అలర్ట్ మెసేజ్‌లు, సైరన్ చప్పుళ్లతో భయాందోళనకు గురవుతున్నారు. బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. టెల్అవీవ్ పట్టణంలోని మెట్రో రైల్వేస్టేషన్ వద్ద భూగర్భంలో నిర్మించిన మూడో ఫ్లోర్ బంకర్లలో వేలాది మంది రాత్రుల్లో తలదాచుకుంటున్నారు. తెల్లవారి బయటకు వచ్చి తమ పనులు చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాతున్నదని అక్కడే ఉంటున్న నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన దేవరాజ్ తెలిపారు. యుద్ధ వాతావరణం కారణంగా సరైన భోజనం, ప్రశాంతమైన నిద్ర కూడా లేకుండా పోయాయని వాపోయారు.
ఇజ్రాయెల్‌లో బాంబులు, క్షిపణుల దాడులు జరగడానికి 10 నిమిషాల ముందే.. అక్కడి పౌరుల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. దాంతో అక్కడ ఉన్నవారంతా తమకు సమీపంలో ఉన్న బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటారు. బాంబు పడే ముందు వచ్చే సైరన్‌ను విని బంకర్లోకి వెళ్లడం, దాడి జరిగిన అనంతరం తిరిగి బయటకు రావడం ఇప్పుడు ఇజ్రాయెల్‌లో సాధారణంగా మారింది. మెసేజ్ అలర్ట్ వచ్చిందంటే చాలు పది నిమిషాల్లోపు బంకర్లలోకి వెళ్లాలి. ఈ పరిస్థితుల్లో గత కొన్నేండ్లుగా ఇజ్రాయెల్‌లో స్థిరపడ్డ సిరిసిల్ల వాసి ప్రసాద్.. అక్కడకు కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రాంత వాసులకు కొండంత ధైర్యం చెప్తున్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో సూచనలిస్తూ సహకరిస్తున్నారు.
క్షిపణులు పడ్డప్పుడల్లా పెద్ద పెద్ద శబ్ధాలు వస్తున్నాయి. దాంతో నిద్ర కూడా సరిగా పడ్తలేదు. 20 ఏండ్లలో ఇటువంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు. ఒక్కోసారి తినేటప్పుడే సైరన్న్లు వస్తుండటంతో తిండి పక్కనే పడేసి బంకర్లలోకి పరుగులు పెడుతున్నాం. – దేవరాజ్, కమ్మర్పల్లి వాసి