షాద్‌నగర్/కొందుర్గు: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవి చిన్న కుమార్తె ప్రగతిరెడ్డి(35)కి సిద్దిపేట సమీపంలోని బక్రిచెప్రియాల్ గ్రామానికి చెందిన రోహిత్‌రెడ్డితో 2016లో వివాహమైంది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన ప్రగతి ఉన్నత చదువుల కోసం 2012లో అమెరికాకు వెళ్లారు. భార్యాభర్తలిద్దరు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు.
ఈ నెల 16న తెల్లవారుజామున 3 గంటలకు ప్రగతిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును.. రాంగ్రూట్లో వచ్చిన ట్రక్కు ఢీకొన్నదని, ఈ ప్రమాదంలో ప్రగతిరెడ్డితోపాటు ఆమె పెద్ద కుమారుడు అర్విన్(6), అత్త సునీత(56) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో టేకులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల దహన సంస్కారాలు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసుల మృతిపట్ల మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ట్విట్టర్లో సంతాపం ప్రకటించారు. ఈ దుఃఖ సమయంలో దేవుడు వారికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. గాయపడిన రోహిత్‌రెడ్డితోపాటు అతని చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.