Tariff War | చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50శాతం సుంకాలు విధిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చైనాపై ప్రతీకార సుంకాలు విధించడం ఏకపక్షమని, రెచ్చగొట్టే చర్యలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతీకార సుంకాలపై తాము సైతం ప్రతీకారంగా సుంకాలను విధించామని.. భవిష్యత్‌లో మరిన్ని సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది.
సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా ఈ చర్యలు తీసుకుందని తెలిపింది. సాధారణ అంతర్జాతీయ వాణిజ్య క్రమాన్ని కొనసాగించేందుకు ఉద్దేశించిన పూర్తిగా చట్టబద్ధమైన చర్య అని.. చైనాపై సుంకాలు పెంచుతామని అమెరికా బెదిరించడం తప్పు అని పేర్కొంది. ఇది మరోసారి అమెరికా బ్లాక్ మెయిలింగ్ వైఖరిని బహిర్గతం చేసిందని.. దీన్నీ చైనా ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. యూఎస్ అదే మార్గంలో వెళ్తే.. చైనా చివరి వరకు పోరాడుతుందని చెప్పింది.
డొనాల్డ్ ట్రంప్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై చైనా మంత్రిత్వశాఖ ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ చైనాపై అదనంగా సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై చైనా 34శాతం సుంకాలను ప్రకటించింది. అయితే, దీనిపై ట్రంప్ సోమవారం ఘాటుగా స్పందించారు. ఏప్రిల్ 8 నాటికి చైనా ప్రకటించిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని హుకూం జారీ చేశారు. లేకపోతే 50శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. కొత్త సుంకాలు 9వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు. దాంతో పాటు చైనాతో జరుపనున్న అన్ని చర్చలు సైతం రద్దవుతాయని స్పష్టం చేశారు.
వాస్తవానికి, ఈ నెల 2న భారత్‌పై 26శాతం ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. వియత్నాంపై 46శాతం, చైనాపై 34శాతం, తైవాన్‌పై 32శాతం, దక్షిణ కొరియాపై 25శాతం, జపాన్‌పై 24శాతం, యూరోపియన్ యూనియన్‌పై 20శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై అమెరికాపై ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని.. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. దాంతో భారత్ సహా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు పెరిగాయి. ట్రంప్ సుంకాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాబోయే కాలంలో ప్రపంచ మార్కెట్‌కు ప్రత్యామ్నాయ చాంపియన్‌గా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రక్షకుడిగా నిలవాలని చైనా ఆలోచిస్తున్నది. ప్రపంచ దేశాల శ్రేయస్సు తనపైనే ఆధారపడి ఉందనే సందేశాన్ని పంపాలనుకుంటున్నది. అమెరికాతో పోలిస్తే చైనా సైతం స్థిరమైన ఆర్థిక భాగస్వామిగా ప్రపంచ దేశాలకు చూపించాలనుకుంటున్నది.
ఈ క్రమంలో ట్రంప్ సుంకాల విషయంలో యూఎస్‌తో చైనా ఢీ అంటే ఢీ అంటున్నది. అమెరికా బెదిరింపులకు తాము భయపడమని.. ఈ తరహా, ఒత్తిడి, బెదిరంపులు మంచిది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యుని మీడియా ట్రంప్ డెడ్‌లపై ప్రశ్నించింది. దీనికి పెంగ్యు స్పందిస్తూ.. ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోమని.. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి, బెదిరింపులకు సరికావన్నారు. చైనా తన చట్టబద్ధమైన హక్కులతో పాటు ప్రయోజనాలను కాపాడుకుంటుందన్నారు.