Sunita Williams | నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ (Sunita Williams) చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి వినియోగించుకోనున్నారు.
బోయింగ్ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్ స్పేస్ మిషన్ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఐఎస్ఎస్కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వారు స్పేస్ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు (vote from space) సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఐఎస్ఎస్లో కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భూ ఉపరితలానికి సుమారు 400 కిలోమీటర్ల పైనుంచి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోనున్నారు. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు 1997లో అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఇప్పటికే పలువురు ఐఎస్ఎస్ నుంచి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న తొలి అమెరికన్‌గా డేవిడ్ వోల్ప్ రికార్డులకెక్కారు. మిర్ స్పేస్ స్టేషన్ నుంచి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 2020 ఎన్నికల్లో కేట్ రూబిన్స్ కూడా ఇలానే ఓటేశారు. ఇప్పుడు సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి ఓటు వేసి వారి సరసన చేరేందుకు సిద్ధమయ్యారు.
విదేశాల్లో ఉన్న అమెరికన్లు ఎలాగైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో అలానే సునీత కూడా ఓటేయనున్నారు. ఇందుకోసం ఆమె తొలుత ఫెడరల్ పోస్ట్ కార్డు అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చాక ఐఎస్ఎస్ కంప్యూటర్ సిస్టం నుంచి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పద్ధతిలో తన ఓటు హక్కును వినియోగించుకుంటారు.
నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యా తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపెవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read..
Ratan Tata | ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అస్వస్థత వార్తలను ఖండించిన రతన్ టాటా
Sanjeev Arora | ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
Kerala Assembly: సీఎం, ప్రతిపక్ష నేత మధ్య వాగ్వాదం.. కేరళ అసెంబ్లీ వాయిదా