తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ(Kerala Assembly)లో ఇవాళ సీఎం పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో సభను సోమవారం వాయిదా వేశారు. సీఎం విజయన్‌కు వ్యతిరేకంగా యూడీఎఫ్ సభ్యులు ఇవాళ స్పీకర్ ఏఎన్ శంషీర్ పోడియంను చట్టుముట్టారు. ఓ బ్యానర్‌తో ప్రదర్శన నిర్వహించారు. స్పీకర్ ముఖం కనబడకుండా బ్యానర్లను పట్టుకున్నారు. ఆ సమయంలో విపక్ష నేతల చర్యలను ఖండిస్తూ సీఎం విజయన్ ప్రసంగించారు. విపక్ష నేతలు నినాదాలు చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
మలప్పురం గోల్డ్, హవాలా లింకులపై ఇటీవల సీఎం విజయన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అయితే ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కానీ స్టార్ ప్రశ్నలను నాన్ స్టార్‌గా మార్చారని, దీని పట్ల విపక్ష నేత సతీషన్ అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం క్వశ్చన్ అవర్‌ను రద్దు చేశారు. ఆ తర్వాత జీరో అవర్ సమయంలో విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. సీఎం విజయన్ అవినీతిపరుడు అని విపక్ష నేత ఆరోపించారు. ఆ సమయంలో విపక్ష నేత సతీషన్పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ అసెంబ్లీలో అసలైన విపక్ష నేత ఎవరు అని ప్రశ్నించారు. కేరళ అసెంబ్లీ చరిత్రలోనే అపరిపక్వ, నాణత్య లేని విపక్ష నేత సతీషన్ అంటూ సీఎం విమర్శించారు.