Donald Trump | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడారు. యుద్ధాన్ని ఆపింది తానేనని మరోసారి పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం తన ఘనతే అని పదేపదే ప్రకటించుకుంటున్నారు. తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించిన తర్వాతే ఈ యుద్ధం ఆగినట్లు ట్రంప్ తెలిపారు.
నెదర్లాండ్స్ జరిగిన నాటో సదస్సులో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సహా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే నెలకొన్న సైనిక సంఘర్షణలను ప్రస్తావించారు. అయితే, వాటన్నింటికంటే ముఖ్యమైనది భారత్-పాక్ వివాదం అని తెలిపారు. దాన్ని తాను ముగించగలిగానని చెప్పుకొచ్చారు. ‘యుద్ధాలన్నింటిలో అతి ముఖ్యమైనది భారత్-పాక్ అంశం. దాన్ని నేను ఫోన్ కాల్స్‌తోనే ముగించగలిగాను. మీరు ఒకరితో ఒకరు పోరాడితే.. మేం ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోమని చెప్పాను. దీంతో వారు మాతో వాణిజ్య ఒప్పందం కోరుకున్నారు. అందుకే యుద్ధాన్ని ఆపారు’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు గొప్ప మిత్రుడు అని ట్రంప్ తెలిపారు. అదే సమయంలో పాకిస్థాన్ జనరల్ అసీమ్ మునీర్ తనను చాలా ఆకట్టుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈవివాదంపై ప్రధాని మోదీ.. స్వయంగా ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌కు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) వెల్లడించారు. దాదాపు 35 నిమిషాల పాటూ ఇద్దరూ ఫోన్లో సంభాషించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను ట్రంప్‌కు మోదీ వివరించినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మిలటరీ స్థాయి చర్చలు జరిగాయన్నారు. ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పినట్లు మిస్రీ వివరించారు.
Also Read..
“Donald Trump | ఇరాన్‌పై దాడికి సిద్ధమైన అమెరికా.. ప్రైవేట్‌గా ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!”