Donald Trump | భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటనపై భారత్‌లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో రంగంలోకి దిగిన ప్రధాని మోదీ.. స్వయంగా ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌కు తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో ట్రంప్ ఈ వ్యవహారంపై తాజాగా స్పందించారు. ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. భారత్-పాక్ చర్చల ద్వారా ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పారు. పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఆయనకు ట్రంప్ విందు ఇచ్చారు. అనంతరం ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంలో నా ప్రమేయం లేదు. ఇద్దరు తెలివైన నేతలు యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్ధానికి దారి తీసేవి. ఆ రెండు దేశాలూ అణుశక్తి కలగినవి. అందుకే చర్చల ద్వారా ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. భారత్-పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌తో ప్రధాని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) వెల్లడించారు. దాదాపు 35 నిమిషాల పాటూ ఇద్దరూ ఫోన్లో సంభాషించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను ట్రంప్‌కు మోదీ వివరించినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మిలటరీ స్థాయి చర్చలు జరిగాయన్నారు. ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పినట్లు మిస్రీ వివరించారు.
Also Read..
Donald Trump | ఇరాన్‌పై దాడికి సిద్ధమైన అమెరికా.. ప్రైవేట్‌గా ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!
ఇజ్రాయెల్‌పై హైపర్‌సానిక్ క్షిపణులు