లండన్ : క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నుంచి తిరిగి వస్తున్న యూరోపియన్లు భారీ మంచు, వర్షం వల్ల ఆదివారం అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీలలో అనేక ప్రధాన విమానాశ్రయాలు విమానాల టేకాఫ్, ల్యాండింగ్లను సస్పెండ్ చేశాయి. ఉత్తర ఇంగ్లండ్‌లోని ప్రధాన రోడ్లపై మంచు కురియడంతో రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 40 సెంటీమీటర్ల మంచు కురిసింది.
దేశవ్యాప్తంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయాలు కలిగినట్లు నేషనల్ గ్రిడ్ వెల్లడించింది. కురుస్తున్న మంచు, గడ్డ కట్టిన మంచు వల్ల జర్మనీ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. నైరుతి జర్మనీలో శీతాకాలం వాతావరణం వ్యాపిస్తున్నదని వాతావరణ శాఖ తెలిపింది. వాహనాల డ్రైవర్లు, పాదచారులకు బ్లాక్ ఐస్ వార్నింగ్స్ ఇచ్చింది. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సలహా ఇచ్చింది.
దశాబ్ద కాలంలో నమోదు కానంతటి అత్యల్ప ఉష్ణోగ్రతలు, మంచు తుఫాన్ అమెరికన్లను ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఈ తుపాను దేశ మధ్య భాగంలో ప్రారంభమై సోమ, మంగళవారాల్లో తూర్పు దిశగా కదలబోతున్నది. సెంట్రల్ ప్లెయిన్స్ నుంచి మిడ్-అట్లాంటిక్ వరకు ఉన్న రాష్ర్టాల్లోని దాదాపు 6 కోట్ల మంది ప్రజలు ఈ తుఫానును ఎదుర్కొనవలసి ఉంటుందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది.