టెహ్రాన్, జూలై 10: తన దాడులు పూర్తయ్యాయని అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్‌పై వరుసగా రహస్య వైమానిక దాడులు జరిగాయి. దీంతో ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ఎవరు జరిపారన్న ప్రశ్నలు తలెత్తాయి. సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో గురువారం ఈ వైమానిక దాడులు జరిగాయి. ఇవి దక్షిణ ఇరాన్‌లోని వివిధ ప్రాంతాలను తాకాయి. ఇరాన్ యుద్ధంలో పాల్గొన్న ఇజ్రాయెల్ తాజా దాడులకు బాధ్యత వహించలేదు. ఈ దాడులకు సంబంధించి ఇరాన్ కూడా ఎవరినీ నిందించలేదు. అయితే ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా సాగిస్తున్న పోరాటంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మద్దతు ఇస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఇరాన్ నాయకుడు ఒకరు ఆ దేశానికి హెచ్చరిక జారీ చేశారు. హొర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు స్వేచ్ఛా మార్గం ఉండాలని గల్ఫ్ అరబ్ దేశాలు, అమెరికా కోరుతున్న తరుణంలోనే ఈ దాడులు జరిగాయి.
అయితే ప్రపంచవ్యాప్త చమురు, సహజ వాయువు రవాణాలో 20 శాతానికి పైగా నియంత్రించే ఆ జలసంధి పూర్తిగా తమ అధీనంలోనే ఉండాలని ఇరాన్ పట్టుబడుతున్నది. అనేక సంవత్సరాలుగా ఆ జలసంధిని అంతర్జాతీయ జలమార్గంగా పరిగణిస్తుండగా దాని గుండా వెళ్లే నౌకలు తమకు రుసుము చెల్లించాలని కూడా ఇరాన్ డిమాండు చేస్తోంది. కాగా గురువారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు ఇరాన్‌లోని 90 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల పరంపరను పూర్తి చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే బుషెహర్, సిస్టాన్, బలూచిస్థాన్ ప్రావిన్సులలో గురువారం వరుసగా వైమానిక దాడులు, పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. యుద్ధం ఉధృతంగా సాగుతున్న కాలంలో తమ ఇంధన స్థావరాలపై ఇరాన్ దాడులు జరిపిన తర్వాత ఆ దేశంపై సౌదీ అరేబియా, యూఏఈ వైమానిక దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా దాడుల నేపథ్యంలో అమెరికాతో సహకరించినందుకు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తూ యూఏఈని ఇరాన్ హెచ్చరించింది. కాగా చర్చలు కొనసాగించాలని అమెరికాను ఇరాన్ కోరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు. అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర ; అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా హెచ్చరిక!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ మళ్లీ కుట్ర పన్నుతోందని సూచించే కొత్త నిఘా సమాచారాన్ని అమెరికాతో ఇజ్రాయెల్ పంచుకుందని అమెరికా మీడియా వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందం ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఒక హత్య కుట్రకు సంబంధించిన సమాచారం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతను మరో స్థాయికి చేర్చి పరిస్థితిని తీవ్రతరం చేసింది. అయితే ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను తీవ్రతరం చేయాలా లేక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలా అని ట్రంప్ ఆలోచిస్తున్న తరుణంలో ఆయన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకే ఇజ్రాయెల్ నిఘా సమాచారం ఒక ప్రయత్నంగా ఉండవచ్చని కొందరు అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.