– కోదాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో అవినీతి కంపు
– టెండర్ విలువ రూ.182 కోట్లు.. ప్రకటనల్లో మాత్రం రూ.258 కోట్లు
– బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంలో ఆంతర్యం?
– సింగారం, మాధవరం రిజర్వాయర్ల దుస్థితి ఏందో అందరికీ తెలిసిందే
– కాంట్రాక్ట్ రద్దుచేసి నాణ్యతతో పనులు చేయాలన్నదే తమ ఆకాంక్ష
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జూలై 27 : కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కోదాడ పట్టణంలోఅండర్ డ్రైనేజీ పనుల్లో కమీషన్ల కోసం కే ఎల్ ఎస్ ఆర్ పేరుతో బ్లాక్ లిస్టులో ఉన్న ఓ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టిన విషయాన్ని ఆయన ఆధారాలతో బహిర్గతపరిచారు. సదరు కాంట్రాక్టర్ ది చీకటి చరిత్ర అని, ఆయనపై ఇప్పటికీ కోర్టులో కేసులు ఉన్నాయని , డ్రైనేజీ పనులను ఆయనకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు నిగ్గు తేల్చాలన్నారు. వాస్తవ టెండర్ లో రూ.182 కోట్లు కోట్ చేస్తే ప్రకటనలో మాత్రం రూ.258కోట్లుగా ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తేడాగా ఉన్న రూ.72 కోట్ల మతలబెంటో నిగ్గు తేల్చాలని, బ్లాక్ లిస్ట్ లో ఉన్న కాంట్రాక్టర్ కు టెండర్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
డ్రైనేజీ నిర్మాణ పనులకు తాము వ్యతిరేకం కాదని, నాసిరకం పైపులతో నిర్మాణం చేస్తే పారిశుధ్య లోపంతో అస్తవ్యస్తమై పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతారనేదే తమ ఆవేదన అన్నారు. నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సింగారం ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే కాంట్రాక్టర్ నాసిరకం పైపులైన్ వేయడం వల్ల ఒక గ్రామానికి కూడా చుక్క నీరు అందని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మాధవరం రిజర్వాయర్ పరిస్థితి కూడా అదేనని, ఇందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యుడు కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనులు నాసిరకం నిర్మాణంతో జరుగుతున్నందున భవిష్యత్‌లో ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, నాటిన మొక్కలకు నీళ్లు పోసే పరిస్థితి కూడా లేదన్నారు. పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపిస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 70 మంది తాత్కాలిక సిబ్బందిని నియమిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారిని తొలగించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోట నియోజకవర్గంలో అవినీతి చోటుచేసుకుంటుందని, అవినీతిని అరికట్టడమే ప్రతిపక్షంగా తన బాధ్యత అని బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. పట్టణ ప్రముఖులు, మేధావులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో నాణ్యత ప్రమాణాలతో డ్రైనేజీ పనులు పునః ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్, సీనియర్ నాయకుడు పైడిమర్రి సత్యబాబు, పట్టణ నాయకులు కుక్కడ పు బాబు, ఉపేందర్ గౌడ్, కరిముల్లా, గొర్రె రాజేష్, చలిగంటి వెంకట్, సంగిశెట్టి గోపాల్, ఉపేందర్ పాల్గొన్నారు.