Diabetes | మనీలా, సెప్టెంబర్ 27: మధుమేహం బారిన పడ్డవారికి, ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారికి అన్నం ఎక్కువగా తినొద్దని వైద్యులు ముందుగా సూచిస్తుంటారు. మూడుపూటలా అన్నం తినడం అలవాటైన దక్షిణ భారతీయులకు ఈ సూచన పాటించడం కష్టమైన పనే. అయితే, ఇక మీదట ఇలా అన్నం విషయంలో కడుపు కట్టేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. షుగర్ భయం పక్కనపెట్టి కడుపునిండా తెల్లన్నం తినొచ్చని చెప్తున్నారు.
ఫిలిప్పిన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇర్రి)కు చెందిన శాస్త్రవేత్తలు ఇర్రి 147, ఇర్రి 125 అనే రెండు కొత్త వరి రకాలను అభివృద్ధి చేశారు. ఇప్పుడు మనం తినే తెల్ల బియ్యం లానే ఈ బియ్యం కూడా కనిపిస్తాయని, కొంచెం చిన్న సైజులో ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మిగతా రకాల బియ్యంతో పోలిస్తే ఈ రెండు వరి రకాలలో ైగ్లెసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువ ఉంటాయని, ప్రొటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు.
ఏదైనా ఆహారం తిన్న తర్వాత మన రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే స్థాయిని బట్టి ైగ్లెసెమిక్ ఇండెక్స్(జీఐ)ను నిర్ణయిస్తారు. డయాబెటిస్ ఉన్న వారు, ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారు ైగ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారం తినడం మంచిది. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. సాధారణంగా ఇప్పుడు మనం తినే అన్నం ైగ్లెసెమిక్ ఇండెక్స్ స్థాయి 70 నుంచి 92 వరకు ఉంటుందని, ఇర్రి 147 రకం బియ్యం ైగ్లెసెమిక్ ఇండెక్స్ 55 అని, ఇర్రి 125 రకం ైగ్లెసెమిక్ ఇండెక్స్ 51.1 అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏదైనా ఆహారంలో జీఐ 45 కంటే తక్కువగా ఉంటే దానికి ‘అతి తక్కువ’ అని, 46-55 మధ్య ఉంటే ‘తక్కువ’ అని, 56-69 మధ్య ఉంటే ‘మధ్యస్థ’ అని, 70 కంటే ఎక్కువ ఉంటే ‘ఎక్కువ’ అని భావిస్తున్నారు. ఈ లెక్కన ఈ రెండు కొత్త వరి రకాల ైగ్లెసెమిక్ ఇండెక్స్ స్థాయిలు ‘తక్కువ’గా ఉన్నట్టు లెక్క.
ఈ రెండు కొత్త వరి రకాలను వచ్చే ఏడాది భారత్లో పండించేందుకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ నేసె శ్రీనివాసులు తెలిపారు. భారత్ సహా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ వరి రకాలను అందుబాటులోకి తేనున్నారు. ప్రపంచంలో అన్నం తినేవారు, మధుమేహ బాధితులు ఎక్కువగా ఆసియాలోనే ఉన్నందున ఈ వరి రకాలు మొదట ఆసియాలోనే పండించనున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచంలో 53.7 కోట్ల మంది మధుమేహులు ఉన్నారు. 2045 నాటికి 78.3 కోట్ల మంది మధుమేహం బారిన పడనున్నారనే అంచనాలు ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం మధుమేహుల్లో ఏషియన్లే 60 శాతం మంది ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వరి రకాలు ఏషియన్ల ఆహారంలో కీలకంగా మారబోతున్నాయని ఇర్రి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.