Heart Attack | బీజింగ్, మార్చి 13: యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్య సమస్య హార్ట్ ఎటాక్ రాకుండా ముందస్తుగానే అడ్డుకునే వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా పరిశోధకులు పురోగతి సాధించారు. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ఎలుకలపై ప్రయోగించగా అథెరోస్లెరోసిస్ నివారణలో మెరుగైన ఫలితాలు కనిపించాయి.
కొన్ని పరిస్థితుల్లో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీనినే అథెరోస్లెరోసిస్ అంటారు. దీని వల్ల రక్త సరఫరా నిలిచిపోవడం, స్ట్రోక్స్, హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా (అథెరోస్లెరోసిస్) ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు చైనా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశాక టీ-సెల్స్ (తెల్ల రక్త కణాలు) యాక్టివేట్ అయి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకట్ట వేస్తుంది.