టెల్ అవీవ్: అవసరానికి సైనికపరంగా ఆదుకుంటుందని నమ్మకం పెట్టుకున్న పాకిస్థాన్ హ్యాండివ్వడంతో సౌదీ అరేబియా ఇప్పుడు హౌతీ మిలిటెంట్ల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. యెమెన్ ఎర్ర సముద్ర తీరానికి సమీపంలో ఉన్న బాబా ఎల్-మాండెబ్ జలసంధిని హౌతీలు స్వాధీనం చేసుకోవడంతో చమురు రవాణా కాక తీవ్ర ఇక్కట్లు పడుతున్నది. సౌదీ మిత్ర దేశాలు ముఖ్యంగా మక్కా ఒప్పంద భాగస్వామి అయిన పాకిస్థాన్.. యెమెన్ సంక్షోభంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సౌదీ అరేబియా, తుర్కియేతో పాకిస్థాన్ మక్కా రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక దేశంపై మరోటి దాడి చేస్తే మిగిలిన దేశాలు దానికి రక్షణ సహకారం అందించి శత్రుదేశంపై సైనిక చర్యకు దిగాలి. ఈ క్రమంలో సౌదీపై హౌతీలు దాడులు చేస్తున్న క్రమం లో పాకిస్థాన్ ఆ దేశానికి సహాయకారిగా యుద్ధంలోకి దిగాలి. అయితే యెమెన్‌లో హౌతీలతో పోరాడటానికి, తమ బలగాలను మోహరించడానికి ఇస్లామాబాద్ తోసిపుచ్చినట్టు సమాచారం. దీంతో వేరే గత్యంతరం లేక రియాద్.. ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపింది. ఇతర గల్ఫ్ దేశాలు, ఈజిప్ట్‌లను హౌతీల దాడుల నుంచి రక్షించాలని ఇజ్రాయెల్‌కు సౌదీ రాజు ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ విజ్ఞప్తి చేశారని ఇజ్రాయెల్ హయోమ్ తన కథనంలో పేర్కొంది.
మక్కాలో తొలిసారి వైమానిక దాడి హెచ్చరిక
సౌదీ అరేబియాలోని పశ్చిమ తీరంలోని పలు నగరాల్లో సౌదీ సివిల్ డిఫెన్స్ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. పవిత్ర నగరం మక్కాతో పాటు జెడ్డా, తైఫ్ గవర్నరేట్లలో ఈ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొద్దిసేపటికే వాటిని ఉపసంహరించారు. మక్కాలో వైమానిక ముప్పు హెచ్చరిక జారీ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇటీవలి కాలంలో ఇరాన్ మద్దతు కలిగిన హౌతీలు సౌదీ అరేబియాపై పదేపదే దాడులకు పాల్పడుతుంటంతో ఈ హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది.