హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, ‘అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్’ డాక్టర్ పీ శ్రీహరి హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారట్ (ఆర్సీఐ) డైరెక్టర్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. క్షిపణి వ్యవస్థలు, రాడార్ సాంకేతికత, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన విశేష అనుభవం ఆయనకు ఉన్నది. 1990లో నాగార్జున వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. కోయంబత్తూరులోని పీఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు.
మెకానికల్ ఇంజినీరింగ్ ఫెలోషిప్ కోర్స్ ద్వారా డీఆర్డీవోలో చేరారు. 1992 అక్టోబర్‌లో బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎల్ఆర్డీఈ) లో సైంటిస్ట్ ‘బి’గా కెరీర్ ప్రారంభమైంది. ఎల్సీఏ ప్రోగ్రామ్ కోసం రూపొందించిన మల్టీ మోడ్ రాడార్ (ఎంఎంఆర్)పై ప్రారంభ దశలో పనిచేశారు. మల్టీలేయర్ స్లాటెడ్ అరే యాంటెన్నా సాంకేతికతను ఏఎల్‌హెచ్, బీఎఫ్ఎస్ఆర్ డీఆర్డీవో యాంటెన్నా ప్రోగ్రామ్‌లో వినియోగించారు.
2019లో డీఆర్డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) చేపట్టిన ఎంఆర్ఎస్ఏఎం (ఐఏఎఫ్) ప్రాజెక్ట్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో తొలి ఫైరింగ్ యూనిట్‌ను 2021 అక్టోబర్‌లో భారత వైమానిక దళంలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. 2022లో భారత ప్రతిష్టాత్మక బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. అగ్ని అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సెల్ఫ్ రిలయన్స్, డీఆర్డీవో అవార్డు ఫర్ పాత్ బ్రేకింగ్ రీసెర్చ్, సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు ఉన్నాయి.