సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాలు వరుస హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పాత కక్ష్యల నేపథ్యంలో నాగోల్‌లోని ఓ బార్లో రౌడీషీటర్లు హత్య చేయడం ఒకటై తే… ఘట్కేసర్ పోచారం ప్రాంతంలో గణేష్ విగ్రహాల కొనుగోలు విషయంలో యువకుల మధ్య ఏర్పడ్డ వివాదంతో మరొకటి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ పండుగ వేళ ఈ రెండు హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. నాగోల్‌లోని బార్లో జరిగిన హత్య ఘటన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. బార్లో చేతికి దొరికిన వాటిని తీసుకొని నిందితులు బాధితుడిపై విరుచుకుపడిన దృశ్యాలు బయటకు రావడంతో అవి సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు రెండు మూడు హత్యలు జరుగుతుండడంతో ఆందోళన కల్గిస్తోంది. హత్యలతో మహానగరం అట్టుడుకుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక పక్క దొంగతనాలు మరో పక్క హత్యలు, హత్యా యత్నాలతో మహానగరం అట్టుడుకుతున్నది. ఇటీవల మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో వరుస హత్యలు జరిగాయి. ప్రతి నిత్యం ఎక్కడో ఓ దగ్గర హత్యలు జరుగుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ దిగజారుతున్న శాంతి భద్రతల సమస్యలపై ఉన్నతాధికారులు పట్టిపట్టనట్లుగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఏమి జరుగుతోంది, నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రణాళికలను తయారు చేయడంలో కొందరు ఉన్నతాధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహారిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమయ్యిందంటూ విమర్శలు వస్తున్నా వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ సిబ్బంది కొందరు వాపోతున్నారు. పెట్రోలింగ్ వాహనాలు అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయంటూ సిబ్బంది సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరంతర పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలను కట్టడి చేయవచ్చు అనేది పోలీసులు తరుచు చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. వినాయ చవితి సందర్భంగా ఎటూ చూసిన పోలీసులు కన్పిస్తుంటారు, అలాంటప్పుడు ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది వరుస హత్యలు ఆందోళన కల్గిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే ఎంతో మంది రౌడీషీటర్లు తిష్టవేశారు. దీనికి తోడు ఇతర ప్రాంతాలలో ఉండే రౌడీషీటర్లు కూడా ఇక్కడే వచ్చి అవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రౌడీషీటర్లపై పోలీసుల నిఘా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండే రౌడీషీటర్లపై నిఘా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రమంతా ఒకే నెట్వర్క్ కిందకు వస్తుండడంతో ఏ రౌడీషీటర్ ఎక్కడుతున్నాడు అనే విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనికాకున్నా, ఆ దిశగా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితులు రోజు రోజుకు అధ్వాన్నంగా తయారవుతున్నాయి.
నాగోల్‌లో జరిగిన రౌడీషీటర్ హత్య ఘటనలో నిందితులు పరారయ్యారా? పోలీసుల ఎదుట లొంగిపోయారా? అనే విషయంలో స్పష్టత లేదు. ఖమ్మంలో రౌడీషీటర్ల మధ్య ఏర్పడ్డ తగాదాలు హైదరాబాద్‌లో హత్యకు ఉసిగొల్పాయి. వందల మంది చూస్తుండగా రౌడీషీటర్లు బార్ అండ్ రెస్టారెంట్లో దారుణ హత్యకు ఒడిగట్టారు. సినీ ఫక్కీలో రౌడీలు వచ్చి ఈజీగా హత్యలు చేసి పరారయ్యే విధంగా నాగోల్‌లో జరిగిన ఘటన జరిగిందంటూ స్థానికులు చెబుతున్నారు. అంతమంది చూస్తుండగా హత్య చేసిన దుండగులు పక్కా ఫ్లాన్తోనే వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయ్యేందుకు కూడా ప్లాన్ చేసినట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు. పోలీసులు సైతం కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని మంగళవారం సాయంత్రమే వారిని అరెస్ట్ చేస్తున్నారని స్థానికంగా చర్చ జరిగింది. అయితే పోలీసుల నుంచి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అవన్ని ఉహాగానాలేనని, బుధవారం ఈ ఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా హత్యలో పాల్గొన్న ముఠాలో కొందరు ఫ్లాన్ ప్రకారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
పోచారం,సెప్టెంబర్15 వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో గొడవ పడి ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఒకరు మృతి చెందారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన నారపల్లిలో 13న రాత్రి జరిగింది. పోచారం పోలీసుల వివరాల ప్రకారం చౌదరిగూడ గ్రామానికి చెందిన పసులాది కిరణ్ (34) కొంత మంది స్నేహితులతో కలిసి ఇక్కడి వరంగల్ రోడ్డు సమీపంలోని విగ్రహల తయారీ కేంద్రానికి వెళ్ళారు. వినాయక విగ్రహ ధర విషయంలో కొనుగోలుదారులకు, విక్రయదారుడు చోగారాంకు మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. విక్రయదారుని కుటుంబ సభ్యులు కొంత మంది కలిసి కిరణ్‌ను కట్టెలతో కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై కింద పడిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు పక్కన ఉన్న దవఖానకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. విషయం తెలుసుకున్న పోచారం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి దాడిచేసిన వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.