టియాన్జిన్(చైనా), సెప్టెంబర్ 1 : సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి తెలియచేశారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, పుతిన్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి తీసుకువచ్చేందుకు తాజాగా జరుగుతున్న అన్ని ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని, సంబంధిత పక్షాలన్నీ నిర్మాణాత్మకంగా ముందడుగు వేస్తాయని ఆశిస్తున్నామని తన ప్రారంభోపన్యాసంలో మోదీ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న పుతిన్ భారత పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. కష్టకాలంలో సైతం భారత్-రష్యా పరస్పరం అండగా నిలబడ్డాయని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, సౌభాగ్యం కోసం భారత్, రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ముఖ్యమని మోదీ తెలిపారు.
భద్రత, అనుసంధానం, అవకాశం అనే మూడు స్తంభాల ప్రాతిపదికన భారత్ ఇతర దేశాలకు తన స్నేహహస్తం అందచేస్తుందని ఆయన చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా భారత్‌ను తీవ్రంగా వేధిస్తున్న ఉగ్రవాదంపై సమిష్టిగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరముందని మోదీ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రధాని ప్రస్తావించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. సార్వభౌమత్వాన్ని విస్మరించే ప్రాజక్టులు విశ్వాసాన్ని, తాత్పర్యాన్ని కోల్పోతాయని పరోక్షంగా చైనా చేపట్టిన బెల్ట్ అడ్ రోడ్డు ప్రాజెక్టుపై తమ వ్యతిరేకతను మోదీ వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీరు మీదుగా వెళ్లే చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌ను ఆయన ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల సమగ్రతను గౌరవిస్తూ దక్షిణాసియా, మధ్య ఆసియాను అనుసంధానం చేసే ఉద్దేశంతో భారత్ చేపట్టిన ఛాబహార్ పోర్టు, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ వంటి ప్రాజెక్టుల ఆవశ్యకతను మోదీ నొక్కిచెప్పారు.
పహల్గాం ఉగ్ర దాడిని షాంఘై సహకార సంస్థ సోమవారం తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదన్న భారత్ వైఖరిని ఎస్సీవో బలపరిచింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలన్న తన దృఢ సంకల్పాన్ని రెండు రోజుల వార్షిక శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా ఎస్సీవో ప్రకటించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్సీవో ప్రకటించింది.