సోచి రిసార్ట్‌లో వైద్య బృందం చికిత్స
అందుకే పలుమార్లు అజ్ఞాతంలోకి
రష్యా మీడియా సంస్థ ‘ప్రొయెక్ట్’ కథనం
మాస్కో/కీవ్, ఏప్రిల్ 2: రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారా? ఈ వ్యాధి చికిత్స కోసమే ఆయన పలుమార్లు అజ్ఞాతంలోకి వెళ్లారా? దీనికి సంబంధించి రష్యాకి చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ‘ప్రొయెక్ట్’ వెలువరించిన కథ నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు యెవ్జెనీ సెలివనోవ్.. పుతిన్‌తో పాటు సోచి నగరంలోని ఆయన రిసార్ట్‌కి 35 సార్లు వెళ్లారని, మాస్కోలోని అధ్యక్ష భవన వైద్యుల బృందం కూడా తరచుగా అక్కడకు వెళ్లేదని ప్రొయెక్ట్ పేర్కొన్నది. 2016 నుంచి 2019 మధ్య సెలివనోవ్ 166 రోజులు పుతిన్‌తో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయని వెల్లడించింది. 2016 నుంచి వైద్యుల బృందం పుతిన్‌కు చికిత్స అందించి ఉండొచ్చని అభిప్రాయపడింది. చికిత్సలో భాగంగా ఎర్ర జింక కొమ్ముల నుంచి తీసిన రసంతో పుతిన్ స్నానం చేయాలని వైద్యులు సూచించినట్టు పేర్కొన్నది. అయితే ప్రొయెక్ట్ కథనాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ ఖండించారు.
భిన్న వ్యూహ ఆలోచనలో రష్యా
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు చెర్నిహైవ్ పరిసరాల నుంచి రష్యా బలగాలు వేగంగా వెనుదిరుగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖెలో పోడోల్యాక్ తెలిపారు. రష్యా మరో భిన్నమైన వ్యూహంలో ఉన్నట్టు అనిపిస్తున్నదని, తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌పై దృష్టి సారించే అవకాశముందని పేర్కొన్నారు. కీవ్‌కు సమీపంలోని బ్రోవరీ నగరాన్ని తిరిగి అధీనంలోకి తీసుకున్నామని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఆక్రమిత ఎనర్హోదర్ పట్టణంలో రష్యాకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన నిరసకారులపై రష్యా దళాలు టియర్‌గ్యాస్ ప్రయోగించాయి.
నా ఆదేశాలపై చర్చించను!
రష్యా ఆయిల్ డిపోపై జరిగిన దాడిపై స్పందించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిరాకరించారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక కమాండర్ ఇన్ చీఫ్‌గా తాను ఇచ్చిన ఆదేశాలను చర్చించనని పేర్కొన్నారు. మరోవైపు రష్యా బలగాలు ఉత్తర ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల నుంచి వెనక్కు వెళ్తూ అక్కడ అమర్చుతున్న ల్యాండ్మైన్ల పట్ల జెలెన్స్కీ తమ దేశ పౌరులను హెచ్చరించారు.
ఒక్క వీధిలోనే 20 మృతదేహాలు
రష్యా నుంచి తిరిగి ఉక్రెయిన్ అధీనం లోకి వచ్చిన కీవ్ సమీప బుచా పట్టణం లోని ఒక వీధిలో శనివారం 20 మంది పౌరుల మృతదేహాలు గుర్తించినట్టు ఎఎఫ్‌పి జర్నలిస్టులు పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ శరణార్థులు తిరిగి వెళ్లిపోతున్నారని పోలాండ్ బోర్డర్ గార్డ్ శనివారం తెలిపింది. వచ్చిన 24 లక్షల మందిలో 4.21 లక్షల మంది తిరిగి వెళ్లారని తెలిపింది.