ఆహారాన్ని ప్రపంచానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధంగా రష్యా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలోని కామరూన్ పర్యటనకు వెళ్లిన ఆయన.. రష్యాపై మండిపడ్డారు. ఉక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతులు జరగకుండా రష్యా అడ్డుకుంటోందని, తద్వారా ప్రపంచంలో ధాన్యం సరఫరా వ్యవస్థను దెబ్బతీసిందని పశ్చిమ దేశాలు అంటున్న సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన మాక్రాన్.. ఆహారాన్ని ఇలా ఆయుధంగా ఉపయోగించుకుంటోందని రష్యాను దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. పోర్టులకు వెళ్లే దారులను ఉక్రెయిన్ దళాలు నాశనం చేసిందని, కావున ఈ బాధ్యత ఉక్రెయిన్ మీదనే ఉంటుందని తేల్చేసింది.
రష్యా దళాలు దాడి చేయడం మొదలు పెట్టిన తర్వాత ఉక్రెయిన్ దళాలు.. రష్యా సైన్యం ఉపయోగించుకోకుండా ఉండేందుక కొన్ని పోర్టులకు వెళ్లే మార్గాలను, పోర్టులోని సౌకర్యాలను బాంబులతో నాశనం చేసిన సంగతి తెలిసిందే. అలాగే రష్యా సైన్యాలు కూడా ఉక్రెయిన్‌కు కీలకమైన కొన్ని పోర్టులపై బాంబుల వర్షం కురిపించాయి.