రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి దారితీసిన అంశాలివే..
టో తూర్పుదిశగా జరుపుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేసే నెపంతో యూరప్‌లో యుద్ధానికి తెరతీసింది రష్యా. పొరుగుదేశమైన ఉక్రెయన్‌పై దాడికి తెగబడింది. ఈ దాడికి దారితీసిన అంశాలేమిటో చూద్దాం..
మాస్కో, ఫిబ్రవరి 24: నాటో తూర్పుదిశగా జరుపుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేసే నెపంతో యూరప్‌లో యుద్ధానికి తెరతీసింది రష్యా. పొరుగుదేశమైన ఉక్రెయన్‌పై దాడికి తెగబడింది. ఈ దాడికి దారితీసిన అంశాలేమిటో చూద్దాం..
మాజీ సోవియట్ రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్‌పై రష్యా మొదటి నుంచీ గుర్రుగానే ఉంది. గతేడాది ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోలో చేరేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి కోరడం రష్యా అప్రమత్తమైంది.
ఉక్రెయిన్ ధోరణితో ఆగ్రహానికి గురైన రష్యా శిక్షణ కవాతుల నెపంతో దళాలను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించింది. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు తెగబడితే కఠినమైన ఆంక్షలు అమలు చేస్తామని అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు.
తూర్పు యూరప్‌లో, ఉక్రెయిన్‌లో నాటో కూటమి ఎలాంటి సైనిక కార్యకలాపాలు చేపట్టబోమని పశ్చిమదేశాలు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేసింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం కాదు. 2014లో అధ్యక్షుడు పుతిన్‌కు అనుకూలంగా ఉండే తిరుగుబాటుదారులు తూర్పు ఉక్రెయిన్‌లోని పెద్దపెద్ద భూభాగాలను తమ ఆధీనంలోకి తీసుకుని, ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్న సమయంలో రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ జరిపింది. క్రిమియాను తన భూభాగంలో కలిపేసుకుంది.
మాజీ సోవియట్ రిపబ్లిక్‌గా ఉక్రెయిన్‌కు రష్యాతో లోతైన సామాజిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఉక్రెయిన్‌లో అత్యధికులు రష్యన్ భాష మాట్లాడుతారు. 2014 దురాక్రమణ తర్వాత సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి.
రష్యా అనుకూల అధ్యక్షుడిని గద్దె దించిన నేపథ్యంలో 2014లో దురాక్రమణ జరిగింది. తూర్పు ఉక్రెయన్ యుద్ధంలో ఇప్పటివరకు 14,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
తూర్పు ఉక్రెయిన్‌లో, దోన్బాస్ ప్రాంతంలో సాయుధ ఘర్షణల నిలిపివేతకు 2014లో ఉక్రెయిన్, రష్యా మిన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయినా ఘర్షణలు ఆగిపోలేదు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రికత్తలతో ఈయూ, అమెరికా రష్యాపై కఠిన ఆంక్షలు ప్రకటించాయి.
కొద్దివారాల క్రితమే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఉద్రిక్తతల నివారణకు మాస్కో వెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు.
ప్రస్తుత సంక్షోభాన్ని రష్యా, ఉక్రెయిన్ దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చింది.