న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో యుద్ధం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో భారత్ సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలను హొర్ముజ్ జలసంధిలో అడ్డగించబోమని ఇరాన్ గురువారం ప్రకటించింది. భారత్‌తోపాటు రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్‌కు చెందిన నౌకలను సురక్షితంగా జలసంధి గుండా పంపిస్తామని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రభుత్వ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హొర్ముజ్‌ను పూర్తిగా మూసివేయలేదని, ఇరాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న అనేక దేశాలు జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఆయన చెప్పారు.
ఈ నౌకల యజమానులు లేదా దేశాలు మమ్మల్ని సంపద్రించి జలసంధి గుండా ఆ నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు సహకరించాలని కోరారు. వీటిలో కొన్నింటిని మా మిత్రదేశాలుగా పరిగణిస్తున్నాము. లేదా ఇతర కారణాలతో అనుమతిస్తున్నాము. ఆ నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు మా సాయుధ దళాలు సహాయపడుతున్నాయి అని ఆయన చెప్పినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొన్నది.