France inflation | ఐరోపాలో ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చింది. గత 11 ఏండ్ల రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. దీని కారణంగా ఫ్రాన్స్ ఎక్కువగా ప్రభావితం అవుతున్నది. సంపాదన పూర్తిగా నిత్యావసరాలకే సరిపోతుండటంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందిపడుతున్నారు. జీతాలు పెంచాలంటూ ఫ్రాన్స్‌లో లక్షలాది మంది రోడ్డెక్కి నిరసన తెలిపారు. తక్కువ జీతాలతో జీవించలేమంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపించారు. పారిస్‌లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో 8 మంది పోలీసులు గాయపడగా.. 11 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐరోపా ఖండం ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నది. ఇక్కడ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 8.9 శాతం వద్ద ఉన్నది. ద్రవ్యోల్బణం కారణంగా బతకలేకపోతున్నామని, జీతాలు పెంచాల్సిందే అంటూ వేలాది మంది సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఫ్రాన్స్‌లోని చమురు కంపెనీల ఉద్యోగులు విధులను బహిష్కరించారు. జీతం పెంచే వరకు విదుల్లోకి వచ్చేది లేదని కరాఖండితంగా చెప్పారు. దాంతో ఫ్రాన్స్‌లో ఇంధనం కొరత ఏర్పడింది. సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రజల ప్రదర్శన కారణంగా సగం రైళ్లు రద్దుకాగా.. చాలా చోట్ల బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
చమురు కంపెనీల ఉద్యోగుల విధుల బహిష్కరణ కారణంగా ఫ్రాన్స్‌లో 30 శాతం గ్యాస్ స్టేషన్లపై ప్రభావం పడింది. పారిస్, ఉత్తర ఫ్రాన్స్‌లోని బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. పలు ప్రాంతాల్లోని బ్యాంకులపై నిరసనకారులు దాడి చేసి ఫర్నీచర్, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరుకున్నది. ఇది సాధారణం కంటే రెండింతలు ఎక్కువ. గత కొన్ని దశాబ్దాలలో ఇంత పెరుగుదల గమనించడం ఇదే తొలిసారి. కోవిడ్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో చాలా వ్యాపారాలు నిలిచిపోయాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలు దెబ్బతిన్నాయి. ఇవన్నీ ఐరోపాలో ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.