Metro Rail Network : మెట్రో రైలు (Metro Rail) రంగంలో భారత్ (India) మరో భారీ మైలురాయిని అందుకోబోతున్నది. రాబోయే రెండేళ్లలో అమెరికా (USA) ను వెనక్కి నెట్టి చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. ఈ విషయాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి (Union Minister) మనోహర్ లాల్ (Manoharlal) తెలిపారు. ఒకప్పుడు కేవలం కొన్ని నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు ఇప్పుడు దేశంలోని 26 నగరాలకు విస్తరించాయని మంత్రి చెప్పారు.
రాబోయే రోజుల్లో కొత్త మార్గాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానుండటంతో భారత్ మెట్రో నెట్వర్క్ మరింత వేగంగా పెరగనుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో దేశంలో కేవలం 5 నగరాల్లో 245 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రో రైలు మార్గాలు అందుబాటులో ఉండేవని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, దేశవ్యాప్తంగా 26 నగరాల్లో సుమారు 1,170 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
గడిచిన 12 ఏళ్లలోనే దేశ మెట్రో నెట్వర్క్ దాదాపు ఐదు రెట్లు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు పెద్దపీట వేయడంతో కొత్త నగరాల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ కలిగిన దేశంగా ఉంది. చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు పూర్తవుతూ, నిర్మాణంలో ఉన్న మార్గాలు అందుబాటులోకి వస్తే రెండేళ్లలో అమెరికాను భారత్ అధిగమించే అవకాశం ఉందని మనోహర్ లాల్ అన్నారు.
రాబోయే రెండేళ్లలో అమెరికాను అధిగమించి చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని తాను భావిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.